-కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముహూర్తం ఖరారు
-ప్రధాని మోదీని కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించనున్న కేసీఆర్‌
-ముఖ్య అతిథులుగా ఏపీ, మహారాష్ట్ర సీఎంలు జగన్‌, ఫడ్నవీస్‌

మహోజ్వల ఘట్టానికి ముహూర్తం కుదిరింది.. కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలన్న సర్కారు లక్ష్యం ఆచరణలో మరో ముందడుగు పడింది. అతి తక్కువ సమయంలోనే అద్భుతంగా రూపుదిద్దుకున్న భారీ సాగునీటి పథకం.. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఏళ్ల తరబడి బీడువారి నోళ్లు తెరిచిన తెలంగాణ నేల నలుచెరగులకూ గోదారమ్మ ఉరకలు వేయనుంది. సాగునీరు లేక దుక్కి దున్నడమే దుఃఖప్రాయమైన ప్రాంతాల్లోకి గంగమ్మ పొంగిపొర్లనుంది. శంకుస్థాపన జరిగిన మూడేళ్లలోనే పూర్తయిన ఈ భారీ ప్రాజెక్టు జనం కల సాకారం చేస్తూ కళ్లముందే జలదృశ్యాన్ని ఆవిష్కరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం ఖర్చుచేసి పూర్తి చేసిన ప్రాజెక్టుగానే కాకుండా తెలంగాణలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరు, అత్యధిక జనాభాకు తాగునీరు అందించే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం ఈనెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా జరగనుంది. ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీని, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, ఫడణవీస్‌లను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు.

About The Author