కాల సర్పదోషాలకు అడ్డుకట్ట….. కుక్కె సుబ్రహ్మణ్యస్వామి…


సంతానం కోసం, జన్మ జన్మల దోష నివారణకు భక్తులు చేరుకునే పరమ పవిత్ర క్షేత్రం కుక్కె సుబ్రహ్మణ్య క్షేత్రం. అజ్ఞానులకు అపారజ్ఞానాన్ని వరంగా ఇచ్చే స్వామి కొలువున్న చోటు ఇది. కుక్కి పురంగా, కుక్కి లింగంగానూ పిలిచే ఈ క్షేత్రం బెంగళూరు నుండి 300 కిలోమీటర్లు, మంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ క్షేత్రానికి చుట్టూ కుమార పర్వతశ్రేణులు ఉన్నాయి. ఈ క్షేత్రానికి బస్సు, రైలు మార్గాల ద్వారా చేరుకోవచ్చు. తమిళనాడులో ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలుండగా, కర్ణాటకలో మూడు ప్రసిద్ధ సుబ్రహ్యణ్య క్షేత్రాలు ఉన్నాయి. కర్ణాటకలో ఉన్న ఈ మూడు క్షేత్రాలు స్వామిని సర్ప రూపంలో చూపి ఆది మధ్యాంతాలుగా చెబుతాయి.

నాగదోష నివారణ గాథ…..

కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ధి. దీనికి గల కారణం గురించిన గాథ… గరుడుని వలన ప్రాణభయం ఏర్పడటంతో సర్పరాజైన వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపస్సు చేశాడట. కుమారస్వామి వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగరాజుకి అభయమిచ్చారు. అందువల్లే వాసుకి పీఠంగా, ఆదిశేషుడు నీడగా ఉండి ఆ పైన స్వామి సేవలో తరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తే నాగదోషం తొలగిపోతుందని చెబుతారు. కుక్కెలో స్వామి మొదట ఒక పుట్టగా వెలిశాడట. దానినే ఆది సుబ్రహ్మణ్య అని పిలుస్తారు. ఈ స్వామిని ముందుగా దర్శించుకొని, తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఇక్కడ ఇచ్చే మూల ప్రసాదం (పుట్టమన్ను) చాలా శక్తివంతమైనది. ఆది శంకరాచార్యులు తన ధర్మ ప్రచార పర్యటనలో కుక్కె సుబ్రహ్మణ్యస్వామిని దర్శించినట్లు కథనాలు ఉన్నాయి.

ప్రకృతి సోయగాలలో…
కుక్కె వెళ్లే రైలు మార్గం అంతా పచ్చదనంతో నిండి కనుల పండుగ చేస్తుంటుంది. అందుకే రైలుమార్గాన్ని పర్యాటకులు ఎంతో ఆనందిస్తారు. కనుమల పై భాగానికి చేరుకునే దారిలో వందకు పైగా వంతెనలు, యాభైకి పైగా టన్నెల్స్ ఉంటాయి. రైలు పర్వత శిఖరాలను చుట్టబెడుతూ వెళ్తుంటే చూడ్డానికి రెండు కళ్లు సరిపోనంతగా ప్రకృతి కనువిందు చేస్తుంది. పక్కనే శిఖరాల నుండి జాలువారే జలపాతాలు, లోయలు, సెలయేళ్లు, వందల అడుగుల ఎత్తున్న చెట్లు, మేఘాలను చుంబించే శిఖరాలను స్వయంగా చూసి ఆనందించాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. ఈ ప్రాంతానికి బస్సు సదుపాయాలూ ఉన్నాయి.

సత్య యుగం నాటి క్షేత్రం…
కుక్కె సుబ్రహ్మణ్య దివ్యక్షేత్రం సత్యయుగం నాటిదని ప్రాచుర్యంలో ఉంది. పూర్వం లోకకంటకులైన తారకాసురుడు, శూరపద్మాసురుడు అనే రాక్షసులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడట. ఆ తర్వాత శక్తి ఆయుధాన్ని ఇక్కడి ధారానదిలో ముంచాడని, అందువల్లే ఈ నది నీటికి ఎంతో శక్తి వచ్చిందని స్కాందపురాణం చెబుతుంది. ఆ తరువాత కుమారధార పర్వతశ్రేణులలో ముక్కోటి దేవతలు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇంద్రుడు తన కుమార్తెలైన వల్లి, దేవసేనలను వివాహం చేసుకొమ్మని కుమారస్వామిని కోరగా ఆయన అంగీకరించాడట. ఆ విధంగా మార్గశిర శుద్ధ షష్ఠి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు ఎంతో ఘనంగా జరుగుతాయి.

పవిత్ర కుమారధారలో స్నానం…
ఈ క్షేత్రంలో మరొక ప్రధానమైనది కుమారధార నది. కుమారస్వామి వివాహ వేళకు మంగళస్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీజలాలను తెచ్చారట. ఆ జలాల ప్రవాహమే నేటి కుమారధార నది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ తీర్థం పరమపవిత్రమైనది. కుక్కె క్షేత్రం లోపలికి వెళ్లేటప్పుడు ఈ కుమారధారను దాటే వెడతాం. చాలా ప్రశాంతంగా, అత్యంత స్వచ్ఛంగా ఉంటుంది ఈ తీర్థం. భక్తులు ఈ తీర్థంలో స్నానం చేసి తరిస్తారు. కుమారధార దాటిన తర్వాత మొదట దర్శనమయ్యేది అభయ గణపతి. ఈయనే ఇక్కడ క్షేత్రపాలకుడు. అభయగణపతి ఆలయం పక్కనే వనదుర్గా అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇంకా ముందుకు వెళితే బస్టాండుకి దగ్గరలో కాశికట్టె గణపతి స్వామి ఆలయం ఉంటుంది. కాశికట్టె గణపతిని నారదమహర్షి ప్రతిష్టించారట. ఇదే ఆలయంలో ఆంజనేయస్వామి సన్నిధి కూడా ఉంటుంది.

వాసుకీ ఆదిశేషుడూ ఆ పైన సుబ్రహ్మణ్యుడు…
ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఏమింటే ఆలయానికి పశ్చిమాన ఉన్న ద్వారం నుండి భక్తులు ప్రవేశిస్తారు. ఆపైన ప్రదక్షిణ చేస్తూ తూర్పు ద్వారం గుండా గర్భాలయానికి చేరుకుంటారు. గర్భాలయానికి ఎదురుగా వెండితో చేసిన ధ్వజస్తంభం ఉంటుంది. వాసుకి, ఆదిశేషుల నుంచి వచ్చే శ్వాసల నుంచి భక్తులను రక్షించడం కోసం ఈ స్తంభం ఏర్పాటు చేసినట్టు చెబుతారు. గర్భగుడిలో వాసుకి, ఆపైన ఆది శేషుడూ, ఆపైన సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉంటారు. ఈ మూర్తి దర్శనమే జన్మజన్మల పాపహరణం. స్వామి దర్శనం మాత్రమే నవగ్రహ దోషాలు శమింపబడి స్వామి వారి కారుణ్యంతో జన్మ తరిస్తుందని భక్తుల అపార విశ్వాసం.

ఇదే ఆలయ ప్రాంగణంలో ఉమామహేశ్వరులు, కుక్కెలింగం, కాలభైరవుడు, నరసింహస్వామి, నాగేంద్రస్వామిని దర్శించుకుంటారు భక్తులు. ఆ పక్కనే అన్నదానం చేసే హాలు, ప్రదక్షిణ దిశలో ముందుకు వెళితే దక్షిణద్వారా దగ్గర కుక్కె సుబ్రహ్మణ్యగ్రామదేవత ‘హోసలిగమ్మ’ కొలువై ఉన్నారు. పరిపూర్ణ జ్ఞానస్వరూపుడైన షణ్ముఖుని ఆశీస్సులు అందుకున్న భక్తులు ఆధ్యాత్మిక చింతనను మనసు నిండా నింపుకొని వెనుదిరుగుతారు.

అంగప్రదక్షణ…
* ఈ క్షేత్రంలో సంతానం కోసం చేసే ప్రధానమైన సేవలు.. సర్ప సంస్కార పూజ, నాగప్రతిష్ట, అశ్లేషబలి, అంగప్రదక్షణ, తులాభారం
* ఆలయానికి మగవారిని పై దుస్తులతో వెళ్లనివ్వరు. షర్ట్, బనియన్లు కూడా తొలగించాలి. పైన తుండ గుడ్డ వేసుకోవచ్చు.
ఓం శని ఈశ్వరాయనమః.

About The Author