టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ లో…
న్యూఢిల్లీ : టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేష్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం సాయంత్రం ఈ నలుగురు సంతకాలతో కూడిన లేఖను రాజ్యసభ చైర్మన్ వెంకయ్యకు లేఖ అందజేశారు. అనంతరం బీజేపీ వర్కంగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఈ నలుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కమలం కండువాలు కప్పిన నడ్డా.. ఆ నలుగురు ఎంపీలను సాదరంగా ఆహ్వానించారు.
విలీనం చేయండి..!
ఈ సందర్భంగా.. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యను కలిసిన రాజ్యసభ సభ్యులు కలిసి టీడీపీపీని బీజేపీలో విలీనం చేయాలని వినతి చేశారు. ఈ సమావేశంలో కిషన్‌రెడ్డి, జేపీ నడ్డా పాల్గొన్నారు. టీడీపీపీని బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. 10వ షెడ్యూల్‌లోని నాలుగో పేరా ప్రకారం విలీనం చేయాలని లేఖ అందజేశారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంతో ప్రేరణ పొందామని.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పార్టీని విలీనం చేస్తున్నామని రాజీనామా చేసిన ఎంపీలు మీడియాకు వివరించారు. ఇక నుంచి మమ్మల్ని బీజేపీ ఎంపీలుగా గుర్తించాలని వెంకయ్యను వారు కోరారు.
స్వాగతిస్తున్నాం..
ఈ క్రమంలో బీజేపీ కీలకనేత భూపేంద్రయాదవ్ మాట్లాడుతూ.. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యుల చీలికవర్గం బీజేపీలో విలీనం చేశామన్నారు. బీజేపీకి మద్దతు తెలుపుతూ తీర్మానం లేఖలు ఇచ్చారన్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్, గరికపాటి, టీజీ వెంకటేశ్‌ను బీజేపీలోకి స్వాగతిస్తున్నామన్నారు.
ఈ నలుగురు రాకతో…
నడ్డా మాట్లాడుతూ.. మోదీ నాయకత్వం నచ్చి, అమిత్‌షా పిలుపునకు స్పందించి సుజనా, సీఎం రమేష్, టీజీ, గరికపాటి బీజేపీలో చేరారన్నారు. పాజిటివ్ రాజకీయాలపైనే బీజేపీకి విశ్వాసం ఉందన్నారు. సబ్ కా సాత్, సబ్‌కా వికాస్ మా లక్ష్యమని జేపీ నడ్డా తెలిపారు. ఏపీలో బీజేపీ ఈ నలుగురి రాకతో బలోపేతమైందని..
ఏపీలో బీజేపీ పునాదులు పటిష్ఠమవుతాయని నడ్డా పేర్కొన్నారు.