కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయాలు…

తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. సరిగ్గా ఉదయం 11:23 గంటలకు మేడిగడ్డ బ్యారేజి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 11:26 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు. 1:07 గంటలకు కన్నెపల్లి పంప్ హౌజ్ లోని ఆరో మోటార్ ను స్విచాన్ చేశారు. పంప్ హౌజ్ లో మధ్యాహ్నం 1:15 గంటల నుండి నీటి పంపింగ్ ప్రారంభమయింది. దీంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి వచ్చినట్లయింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ ఇ.ఎస్.ఎల్. నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు శ్రీ ఈటెల రాజేందర్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ మంత్రులు శ్రీ పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, డిజిపి శ్రీ మహేందర్ రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, మహారాష్ట్ర డిజీపి జైస్వాల్, ఎంపీలు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్, శ్రీ బి.వెంకటేష్ నేత, విప్ శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీ దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి, జడ్పి చైర్ పర్సన్ శ్రీమతి తుల ఉమ, మాజీ స్పీకర్ శ్రీ మధుసూదనా చారి, నీటి పారుదల శాఖ ఇఎన్సీలు మురళీధర్ రావు, హరే రామ్, వెంకటేశ్వర్లు, ఎన్.పి.డి.సి.ఎల్. సిఎండి గోపాలరావు, ట్రాన్స్ కో డైరెక్టర్ సూర్యప్రకాష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు మేడిగడ్డ బ్యారేజీ వద్ద, కన్నెపల్లి పంప్ హౌజ్ వధ్ధ శృంగేరీ పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలాశయ ప్రతిష్టాంగ యాగం, జలసంకల్ప మహోత్సవ యాగం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత శాస్త్రయుక్తంగా జరిగిన యాగం పూర్ణాహుతితో ముగిసింది. ఈ సందర్భంగా వేద పండితులు ముగ్గురు ముఖ్యమంత్రులను, గవర్నర్ ను ఆశీర్వదించారు.

మేడిగడ్డ బ్యారేజి వధ్ధ జరిగిన యాగంలో ముఖ్యమంత్రి కేసిఆర్ దంపతులు, కన్నెపల్లి పంప్ హౌజ్ దగ్గర జరిగిన యాగంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు పాల్గొన్నారు. ఇదే సమయంలో అన్నారం బ్యారేజిని మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి, అన్నారం పంప్ హౌజ్ ను మంత్రి శ్రీ మహమూద్ అలీ, సుందిళ్ల బ్యారెజీని, పంప్ హౌజ్ లను మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్, మేడారం పంప్ హౌజ్ ను మంత్రి శ్రీ మల్లారెడ్డి, లక్ష్మీపూర్ పంప్ హౌజ్ ను మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

బ్యారేజి చుట్టూ కలియతిరిగిన ముఖ్యమంత్రి, గవర్నర్

మేడిగడ్డి బ్యారేజిని ముఖ్యమంత్రి కేసిఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బ్యారేజికి అనుబంధంగా గోదావరి నదిపై తెలంగాణ-మహారాష్ట్రాల మధ్య నిర్మించిన బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్ ఒకే కారులో తెలంగాణ సరిహద్దు నుండి బ్యారేజీ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణించారు. అనంతరం బ్యారేజి లోపలికి నీరు నిలువ ఉంచే చోటును పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గోదావరి నీటి వినియోగానికి ప్రాజెక్టుల ఆవశ్యకతను గుర్తించిన విధానాన్ని వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నీరు అందిస్తున్నది విడమరిచి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో చేసుకున్న చారిత్రక ఒప్పందమే కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంధ్ర పఢ్నవీస్ అన్ని రకాలుగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కన్నెపల్లి పంప్ హౌజ్ ప్రారంభం సందర్భంగా కూడా ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ ను పంప్ హౌజ్ అడుగు భాగంలో ఏర్పాటు చేసిన పంపుల వద్ధకు తీసుకువెళ్లి చూపించారు. పంపుల సామర్ధ్యం, ఉపయోగంపై విపులంగా చెప్పారు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధి కృష్ణారెడ్డి అతిథులకు నిర్మాణాల విశిష్టతలను వివరించారు.

ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన చారిత్రక సందర్భం

నదీ జలాల వాటాలు, పంపకాల విషయంలో ఇటు రాష్ట్రాల మధ్య, అటు దేశాల మధ్య ఘర్షనలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్రతో అంతరాష్ట్ర వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకు పడలేదు. నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోను వివాదాలు ఉండేవి. నీటి వాటాలు, పంపకాల విషయంలో పేచీలు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఏర్పడిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసిఆర్ స్నేహ పూర్వక దౌత్య సంబంధాలు నడిపారు. గోదావరి జలాలు ప్రతీ ఏటా వేల టిఎంసీల చొప్పున సముద్రం పాలు కావడంకన్న సమర్ధవంతంగా వాడుకునేందుకు ప్రాజెక్టులు నిర్మించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అతిథులకు, బ్యాంకర్లకు ముఖ్యమంత్రి సన్మానం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్య అతిథులు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఘనంగా సన్మానం చేసి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా వారికి ఘనస్వాగతం పలికిన కేసిఆర్ వెళ్లేటప్పుడు హెలికాప్టర్ దాకా వెళ్లి మరీ ఒక్కొక్కరికి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక సహకారం అందించిన వివిధ బ్యాంకుల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించి జ్ఞాపికలు అందించారు.

About The Author