మొబైల్ ఫోన్ ఇబ్బందులు అన్నిఇన్ని కాదు…


మొబైల్ ఫోన్ ఇబ్బందులు అన్నిన్ని కాదు…
కొత్త రకం జబ్బులూ వస్తున్నాయి….

సాంకేతికత అభివృద్ధిలో భాగంగా పుట్టుకొచ్చిన సెల్‌ఫోన్ అనే చిన్న సాధనం సమాజంలో, మనుషుల జీవితాల్లో తెచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. ఈ చిన్న పరికరం లేకుండా మనిషి జీవించడం దాదాపు అసాధ్యమేమో అన్న స్థాయికి చేరింది. చదవడం, రాయడం, తినడం, సరకుల కొనుగోలు ఇలా ప్రతిపనిలో మొబైల్ భాగమైపోయింది. దీని వాడకం వల్ల మనుషుల మధ్య సంబంధాలు, వారి వ్యవహారశైలి, నిర్ణయాక ప్రక్రియలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే మొబైల్‌ వాడకం వల్ల మనిషి మానసిక స్థితిలోనే కాదు… అవయవాల కూర్పులోనూ తేడాలొస్తున్నాయని తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మేరకు 2018లో ఆస్ట్రేలియాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనా ఫలితాలు శాస్త్ర, సాంకేతిక పత్రికల్లో ప్రచురితమవగా.. బీబీసీ, వాషింగ్టన్‌ పోస్ట్‌ వాటిని వెలుగులోకి తెచ్చాయి.
ఈ పరిశోధన ప్రకారం మొబైల్ వినియోగం రోజురోజుకీ పెరుగుతుండడం వల్ల మనిషి పుర్రె భాగం దిగువన కొమ్ములాంటి అవయవాలు వృద్ధి చెందుతున్నట్లు కనుగొన్నారు. మెడ, పుర్రె కలిసే ప్రదేశంలో మనిషికి సహజంగానే బొప్పికట్టినట్లు ఉంటుంది. అయితే చరవాణి వినియోగంలో భాగంగా ఎప్పుడూ తలను కిందికి వాల్చి ఉండడం వల్ల ఆ బొప్పి భాగం పెరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తల బరువు అక్కడ కేంద్రీకృతమవడం వల్లే ఇలా జరుగుతుందని వివరించారు. మన శరీరంలోని ఏదైనా భాగం తరచూ రాపిడి లేదా ఒత్తిడికి గురవడం వల్ల అక్కడి శరీరం మొద్దుబారడంతో పాటు లావుగా తయారైనట్లే ఇదీ జరుగుతోందని తెలిపారు. అయితే ఈ పెరుగుదల దాదాపు అడుగులో 1/3వ వంతు నుంచి ఒక అడుగు వరకు ఉన్నట్లు కనుగొన్నారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు మధ్య యువకుల్లో ఈ అసాధారణ పెరుగుదలను గమనించినట్లు పేర్కొన్నారు.
ఇలా పెరుగుతున్న అవయవానికి ‘ఫోన్‌బోన్స్‌’, ‘హెడ్‌ హార్న్స్‌’, ‘స్పైక్స్‌’, ‘వెయిర్డ్ బంప్స్‌’ ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా మొబైల్‌ వాడకం వల్ల మనుషుల్లో తీవ్ర మెడ, చేతి, తల సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది మాత్రం నిజం.. కొమ్ములు రావడం మాట అటుంచితే ఈ పరిశోధనలో ఉపయోగించిన ఎక్స్‌రేల ఆధారంగా పుర్రెభాగం కాస్త కిందకు వంగుతున్న మాట మాత్రం వాస్తవం అని మరికొందరు తెలిపారు.

About The Author