ప్రతి సోమవారం ‘స్పందన’ లో మనం కలిసి ఆ సమస్యలను పరిష్కరిద్దాం…
– జిల్లా కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లకు సూచించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి సోమవారం ‘స్పందన’ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. ఇది కేవలం కలెక్టరేట్‌కు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాల్లో ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి సోమవారం ఎటువంటి అధికారిక సమావేశం పెట్టుకోవద్దు. మీకు వచ్చే ప్రతి ఫిర్యాదును ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో రశీదు ఇవ్వాలి. పై అధికారులు కూడా ఆ రోజు మీకు ఫోన్లు చేయరు. త్వరలో రచ్చబండ కార్యక్రమం ప్రారంభిస్తాం. ప్రతి నెలా మూడో శుక్రవారం చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వినండి. మీ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించండి. లేదంటే నా దృష్టికి తీసుకురండి. మనం కలిసి ఆ సమస్యలను పరిష్కరిద్దాం. మన దగ్గర పనిచేసే వాళ్లనే సంతోషపెట్టకుంటే ప్రజలను ఎలా సంతోషపెడ్తాం?
వారంలో ఒక రోజు..
ఐఏఎస్ అధికారులు ప్రతి వారం ఒక రోజు రాత్రి ఆకస్మిక తనిఖీ చేయాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, హాస్టళ్లల్లో నిద్ర చేయాలి. మీరు వస్తున్నట్లు ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వద్దు. హాస్టళ్లు, స్కూళ్లు, పీహెచ్‌సీల పరిస్థితిని ఫొటో తీయండి. రెండేళ్ల తర్వాత తీసే ఫొటోలో మన అభివృద్ధి కనపడాలి. వాటి అభివృద్దికి కావాల్సిన నిధులు నేను మంజూరు చేస్తా. ఒక జిల్లా కలెక్టర్‌గా మీరు పనిచేసి వెళ్లిన తర్వాత ప్రజలు మంచిగా గుర్తు చేసుకోవాలి. పాలన పారదర్శకంగా, స్నేహపూర్వకంగా ఉండాలి. కలెక్టర్లు ఎప్పుడు నవ్వుతూ కనిపించాలి. అధికారులను అప్యాయంగా పలకరించాలి. సంక్షేమ పథకాల అమలులో పార్టీలు, రాజకీయాలను పట్టించుకోవద్దు’ అని వైఎస్ జగన్ సూచించారు