చంద్రబాబు నివాసంలో టిడిపి నేతల భేటి…
చంద్రబాబు నివాసంలో టిడిపి నేతల భేటి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సోమవారం టిడిపి నేతలు సమావేశం అయ్యారు. అందుబాటులో ఉన్న నాయకులు ఈ భేటికి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు.
ఈ సందర్భంగా చర్చించిన అంశాలు:
1).ప్రజావేదిక కూల్చివేత నిర్ణయంపై నాయకుల స్పందన: రాష్ట్ర విభజన తరువాత, రాజధాని నగరం అమరావతిలో అధికారులతో సమావేశాల నిర్వహణకు ప్రభుత్వ సమావేశ మందిరాలు లేవు.. ప్రజల నుంచి వినతుల స్వీకరణకు అవకాశం కూడా లేని పరిస్థితి ఉంది. ఏడాదిన్నర పాటు ప్రైవేటు కళ్యాణ మండపాలలోనే వాటిని నిర్వహించుకోవాల్సి వచ్చింది..
ప్రజావసరాల కోసం, ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం ప్రజావేదిక. అది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి..ప్రజలకు ఉపయోగపడే వేదికే ప్రజావేదిక. మేము 5 ఏళ్ల క్రితం రాజధాని నగరానికి వచ్చాం, అప్పుడు ఇక్కడ ఏమీ లేని స్థితిలో దీనిని నిర్మించడం జరిగింది. చట్టపరంగానే, తగిన అనుమతులతోనే, ప్రభుత్వమే దీనిని నిర్మించింది. మీరు 5ఏళ్ల తరువాత వచ్చి కూలగొడతాను అంటున్నారు, ఇల్లీగల్ బిల్డింగ్ అన్నారు..మీకు అక్రమ కట్టడం అనిపిస్తే అధికారిక సమావేశం ప్రజావేదికలో ఎందుకు నిర్వహించారు..?
ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో, ప్రజల నుంచి వినతులు తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రజావేదిక భవనం కేటాయించమని అడిగాం. మా అభ్యర్ధన పైన ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకోకుండా ఏకపక్షంగా కూల్చేయాలని నిర్ణయించారు.
మేము ప్రజావేదికను అడిగాం, దీనిని మాకు కేటాయించాల్సి వస్తుందనే, కూలగొట్టడానికి కక్షపూరిత నిర్ణయం తీసుకున్నారు. మీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారు.
2. ప్రకాశం జిల్లా ఒంగోలులో 17ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని టిడిపి నేతలు ఖండించారు. పోతుల సునీత, పంచుమర్తి అనురాధ నేతృత్వంలో టిడిపి మహిళా నేతల బృందం ఒంగోలు పర్యటించి బాధితురాలిని పరామర్శించాలని కోరారు.
3. రాష్ట్రంలో కొనసాగుతున్న వైసిపి దాడులు, దౌర్జన్యాలపై ఆందోళన ప్రకటించారు. నిన్న ఒక్కరోజే గుంటూరు జిల్లాలోని 2 నియోజకవర్గాలలో టిడిపి కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడటాన్ని ఖండించారు.
– నాదెండ్ల మండలం అమీన్ సాబ్ పేటలో టిడిపి కార్యకర్తల ఇళ్లపై దాడులు చేయడం, ద్విచక్ర వాహనాలు, సిమెంట్ బెంచీలను ధ్వంసం చేయడంపై ఆగ్రహం ప్రకటించారు. పిన్నెల్లిలో దాడులకు పాల్పడి టిడిపి మైనారిటి కార్యకర్త జానీ బాషాను తీవ్రంగా గాయపరచడాన్ని ఖండించారు.
-గత నెలరోజుల్లో జరిగిన దాడులు,దౌర్జన్యాలపై త్వరలోనే డిజిపిని కలిసి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు, టిడిఎల్ పి ఉపనేత అచ్చెన్నాయుడు, శాసన సభ్యులు మద్దాలి గిరి, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్ బాబు, వివివి చౌదరి, మాజీ మంత్రులు కాలువ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
—-