ఇక రేషన్ డీలర్లు ఉండరు, అంతా గ్రామ వాలంటీర్ లే: జగన్ సూచాయగా వెల్లడి
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన దూకుడు ప్రదర్శిస్తున్నారు. అవినీతి తావులేని విధంగా పథకాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలని ఆయన కోరుకుంటున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్లకు ఏపీలో మంగళం
గ్రామ వాలంటీర్ల ద్వారానే ప్రభుత్వ పథకాలు, సరుకులు అమలు
నేరుగా లబ్దిదారుల ఇంటికే ప్రజా పంపిణీ సరుకులు అందజేత
అమరావతి వేదికగా సాగుతున్న కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అవినీతిరహిత పారదర్శక పాలనే తమ ప్రభుత్వ ధ్యేయమని మరోసారి స్పష్టం చేసిన సీఎం, ఆ దిశగా వెళ్లేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సహకరించాలని పేర్కొన్నారు.
ఇక, ప్రభుత్వం అందజేసే రేషన్‌ను నేరుగా లబ్దిదారులకు గ్రామ వాలంటీర్ లు అందజేయనున్నారని సీఎం ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇకపై రేషన్ డీలర్లు ఉండబోరని జగన్ వెల్లడించారు.
వాలంటీర్లే సరకులను ఇంటింటికీ పంపిణీ చేస్తారనే అంశంపై చర్చ సందర్భంగా రేషన్ డీలర్ల ప్రస్తావన వచ్చిన సమయంలో సీఎం పైవిధంగా స్పందించినట్లు తెలుస్తోంది.
తెల్ల రేషన్ కార్డుదారులకు సెప్టెంబరు 1 నుంచి సన్న బియ్యాన్నే పంపిణీ చేయాలని అధికారులకు నిర్దేశించారు.
ఇందుకు పౌర సరఫరాల శాఖ రూపొందించిన ప్రతిపాదనలు, కలెక్టర్ల నుంచి తీసుకునే సహకారం తదితర అంశాలపై ఆ శాఖ కమిషనర్ కోన శశిధర్ నివేదించారు.
ప్యాకింగ్ యూనిట్ల ఏర్పాటు, గొడౌన్లు సంబంధిత వివరాలను పౌరసరఫరాల సంస్థ ఎండీ సూర్యకుమారి వివరించారు.
తినగలిగే బియ్యాన్ని, అదీ ప్యాకింగ్ రూపంలో ఇచ్చే ప్రక్రియ రెండు విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు.
ప్యాకింగ్ యూనిట్లు, నిల్వ కేంద్రాల ఏర్పాటు కొలిక్కి వచ్చిన జిల్లాల్లో తొలి విడతలో, మిగితా చోట్ల రెండో విడతలో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ వద్ద అందుబాటులో ఉన్న బియ్యంలోనే నాణ్యమైన రకాన్ని వేరుచేసి, తొలి విడత జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు.
తర్వాత నుంచి ధాన్యం సేకరణ సమయంలోనే కొన్ని రకాలను వేరుచేసి వీటిని సేకరించనున్నారు.
జిల్లాల్లో ఇప్పటికే ఆటోమేటిక్ ప్యాకింగ్ యూనిట్లు అందుబాటులో ఉంటే వారికి పని అప్పగించేలా ఏర్పాట్లు చేయాలని, అదనంగా నిల్వ కేంద్రాలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
వాలంటీర్ల ధ్రువీకరణ కోసం పంచాయతీరాజ్, పాఠశాల విద్యాశాఖలో అమలుచేస్తున్న విధానాలను పరిశీలించి అమలు చేయాలని, తినగలిగే రకం ధాన్యాన్ని పండించే దిశగా రైతుల్ని ప్రోత్సహించాలని తెలిపారు.
ఖరీఫ్‌లో 1.31లక్షల హెక్టార్లు, రబీలో 3.15లక్షల హెక్టార్లలో ఇలాంటి రకం ధాన్యాన్ని పండించేలా రైతుల్లో మార్పు తీసుకురావాలన్నారు. పంట చేతికొచ్చే సమయంలో సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అపుడే మంచి రకాన్ని వేరు చేయాలని సూచించారు.
ప్యాకింగ్ రూపంలో బియ్యాన్ని నిల్వ చేసేందుకు గ్రామాల్లో స్థలాల ఎంపిక జులై 30 నాటికి, ప్యాకింగ్‌యూనిట్లు, సంచులసేకరణ పూర్తి ఆగస్టు 15 నాటికి పూర్తికావాలి. ఆగస్టు 25 నాటికి గ్రామ వలంటీర్లు, సిబ్బందికి శిక్షణ పూర్తిచేయనున్నారు.
సరకుల సరఫరాకు నెలకు 2.07 కోట్ల సంచులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. నిల్వ కేంద్రాల నుంచి వలంటీర్లు బయోమెట్రిక్ ధ్రువీకరణతో వీటిని తీసుకుంటారు.
లబ్ధిదారుల ఇంటికి తీసుకువెళ్లి వారితోనూ బయోమెట్రిక్ పరికరంపై ధ్రువీకరణ తీసుకున్నాకే సరకుల్ని అందజేస్తారు. లబ్ధిదారుడి వేలిముద్ర సరిగా పడకపోతే వారి ఆధార్ నెంబరు ఆధారంగా సరకులను ఇవ్వనున్నారు.