మైసూర్ లో దలైలామా హత్యకు ఉగ్ర కుట్ర..
కర్ణాటకలోని దొడ్డబళ్లాపురలో పోలీసులకు చిక్కిన బంగ్లాదేశ్ ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ (30) రహస్య కార్యకలాపాలను అధికారులు గురువారం వెలుగులోకి తెచ్చారు. అజ్ఞాతవాసం గడుపుతూ, అనేక నేరపూరిత ప్రణాళికల అమలుకు ఉగ్రవాది సిద్ధమైనట్లు గుర్తించారు. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా హత్యకు కుట్ర పన్నినవిషయం కూడా బయటపడింది.
రహస్య జీవనం సాఫీగా సాగడానికి అవసరమైన డబ్బుల కోసం రెహమాన్ బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో దారి దోపిడీలకు పాల్పడినట్లు అధికారులు కనుగొన్నారు. జమాత్‌ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబి) సభ్యులందరూ ఇలానే దారి దోపిడీలు, దొంగతనాలు చేసేవారని విచారణలో హబీబుర్ వివరించినట్లు సమాచారం.
ఆనేకల్ సమీపంలోని ఒక బిల్డర్ ఇంట్లోకి గతంలో తన సహచరులతో కలిసి చొరబడిన నిందితుడు తుపాకీ, మారణాయుధాలు చూపించి దోపిడీ చేశాడు. కోల్‌కతా, బిహార్‌లలో విచారణ అనంతరం బెంగళూరులో అతన్ని ఎన్‌ఐయే అధికారులు గురువారం నుంచి విచారించడం ప్రారంభించారు.
మైసూరు జిల్లా పిరియా పట్టణ పరిధి బైలుకుప్ప ధార్మిక కేంద్రం, మైసూరు హెజ్జాళ సమీపంలోని శిక్షణ సంస్థకు అప్పుడప్పుడు వచ్చే దలైలామాను హత్య చేసేందుకు జేఎంబీ సభ్యులు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. బుద్ధగయలో 2013లో, పశ్చిమ బెంగాల్‌లో 2014లో పేలుళ్లకు పాల్పడిన అనంతరం హబీబుర్ కర్ణాటకకు చేరుకున్నట్లు గుర్తించారు.
వస్త్ర వ్యాపారం, కూలి పనులు చేసుకుంటూ తొలినాళ్లలో జీవనం సాగించాడు. వైట్‌ఫీల్డ్‌లో కొందరు దళారుల సాయంతో ఆధార్ కార్డునూ పొందడం విస్మయం కలిగించే విషయం. పోలీసులకు దొరక్కుండా సహచరులతో మాట్లాడుకునేందుకు సంకేత భాషను ఉపయోగించేవాడని అధికారుల దర్యాప్తులో తేలింది.