సచివాలయం రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో…


సచివాలయం రెండో బ్లాక్ లోని తన ఛాంబర్ లో మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. విత్తన సేకరణకు, పంపిణీకి గత ప్రభుత్వానికి ఒక స్పష్టమైన కార్యాచరణ లేదని మంత్రి ఆరోపించారు. ఖరీఫ్ ను దృష్టిలో ఉంచుకొని నవంబర్, డిసెంబర్ మాసాల నాటికే సేకరణ ప్రక్రియ పూర్తికావాల్సి ఉందని మంత్రి తెలిపారు. ఆ విషయాన్ని మరిచి 30 రోజుల క్రితమే పరిపాలన చేపట్టిన ప్రభుత్వంపై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక, తెలంగాణ, బరోడా(గుజరాత్) వంటి ప్రాంతాలకు ప్రత్యేక బృందాలు పంపించిందని మంత్రి తెలిపారు. ఆయా ప్రాంతాలలో నాణ్యమైన విత్తనాల లభ్యత ఉందని తెలుసుకొని, అధిక ధర వెచ్చించైనా నాణ్యమైన విత్తనాల సేకరణకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కురసాల అన్నారు.
అదే విధంగా ఖరీఫ్ సీజన్ లో సకాలంలో రైతులకు విత్తనాలను అందించే దిశగా ఇప్పటికే 3 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఇదే సీజన్ లో గత ఏడాది కేవలం 2,70,000 క్వింటాళ్లు మాత్రమే గత ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా మరింతగా విత్తనాల సేకరణపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలు, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా రూ.4,800 కోట్లను వివిధ పథకాల కోసం గత ప్రభుత్వం మళ్లింపు చేయడం ఎంత వరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు. రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రైతు సాధికారత సంస్థ వారి సంక్షేమం కోసం నిధులు వెచ్చించాల్సి ఉండగా, ఆ ఉద్దేశాన్ని పక్కనబెట్టి యంత్ర సామాగ్రి కొనుగోలు కోసం రూ.80 కోట్లను అప్పుగా ఇవ్వడం రైతుల పట్ల వారి అభిప్రాయాన్ని తెలియజేస్తోందన్నారు.
గత ప్రభుత్వం విత్తన పంపిణీ సంస్థలైన మార్క్ ఫెడ్, ఏపీ సీడ్స్ లాంటి సంస్థలకు రూ.380 కోట్ల చెల్లింపులు జరపాల్సి ఉండగా వాటిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి పేర్కొన్నారు. అదే విధంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.980 కోట్ల మేర పెండింగ్ బిల్లులు రైతులకు చెల్లించాల్సి ఉందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల విడుదల కోసం ఇప్పటికే అధికారులు 28 సార్లు లేఖలు రాసినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వాటికి సంబంధించి పూర్తి ఆధారాలున్నాయని అవసరమైతే వాటిని ఆరోపణలు చేసే వారికి అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా గత వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నాటి ప్రభుత్వానికి రాసిన లేఖను మంత్రి కురసాల చదివి వినిపించారు. మార్చి నుండి జూన్ 8 వరకు వాటిపై ఎటువంటి స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు. విత్తన పంపిణీ సంస్థలకు నిధుల పంపిణీ కోసం రూ. 380 కోట్లు చెల్లించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అదే విధంగా మరో రూ.50 కోట్లను బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని నిర్ణయించామన్నారు. గత ప్రభుత్వం అస్తవ్యస్థంగా వ్యవస్థలను తయారు చేశారు..దాన్ని చక్కదిద్దే ప్రయత్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. రాబోయే 10,15 రోజుల్లో మరో వెయ్యి కోట్ల విడుదల కోసం ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రైతులకు ఏ కష్టం రాకుండా చూడాలని, ఎంత ఖర్చు అయినా సరే భరించే విధంగా ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి అన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆర్థిక శాఖ సెక్రటరీ రావత్, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మాట్లాడామని, త్వరలోనే ఆ దిశగా అడుగులు పడతాయని మంత్రి కన్నబాబు వెల్లడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నారని మంత్రి అన్నారు. రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వ హయాంలో ఈ సీజన్ కు సరిపడే విత్తనాలు సిద్ధం చేసి ఉంచాల్సిన పరిస్థితి ఉండగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా తమ ప్రభుత్వంపై అపవాదులు వేయడం ఎంత వరకు సమంజసమని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో విచక్షణను వారికే వదిలి వేస్తున్నామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు.

About The Author