తాగి డ్యూటీకొస్తే ఇంటికే.. పోలీసులకు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు…


డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు అనగానే మందుబాబులకు కోపం నషాలానికి అంటేది.
మద్యం తాగి వాహనాలు నడుపుతున్న చోదకులకు ట్రాఫిక్‌ పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేస్తుంటారు. వాహనాన్ని సీజ్‌ చేస్తారు. కౌన్సెలింగ్‌ నిర్వహించడంతోపాటు, న్యాయ స్థానంలో హాజరు పరుస్తారు.
తాగిన మోతాదును బట్టి న్యాయస్థానం మందుబాబులకు ఒకటి నుంచి 6 రోజుల పాటు జైలు శిక్షను విధిస్తోంది. శిక్షా కాలం పూర్తయిన అనంతరం పోలీసులు వాహనాన్ని అప్పగిస్తారు.
డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ పట్టుబడింది మొదలు తిరిగి వాహనం చేతికి వచ్చే వరకు వాహనదారులు చుక్కలు చూడాల్సి వస్తోందనడంలో సందేహం లేదు.
ఈ పోలీసుల పని బాగుంది. ఏం చేసినా అడిగేవారు లేరు. తాగి డ్యూటీకి వచ్చినా.. డ్యూటీలోనే తాగి ఇంటికి వెళ్లినా ఒంటిమీద ఖాకీ డ్రస్‌ ఉండటంతో అడిగేవారుండరు. చాలా సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన మందుబాబులు చర్చించుకునే మాట.
కొన్ని సందర్భాల్లో డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్న క్రమంలో కొందరు పోలీసుల వద్ద మద్యం వాసన వస్తోందని వాహనదారులు అరోపించేవారు.
సామాన్య వాహనదారులపైనే పోలీసులు ప్రతాపం చూపిస్తారని, ఇలా తాగి డ్యూటీకి వచ్చే పోలీసుల గురించి పట్టించుకునే వారెవరనే విమర్శలు వచ్చాయి.
రాచకొండలో వినూత్నంగా…
కొన్ని ఠాణాల్లో పోలీసులు మద్యం తాగి డ్యూటీకి వస్తున్నారని, వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో మద్యం తాగుతున్నారని, తిరిగి డ్యూటీ దిగి వెళ్లేటప్పుడు మద్యం మత్తులోనే ఇంటికి వెళ్తున్నారని ఇలా పోలీసులపై అనేక రకాల ఆరోపణలు వెల్లువెత్తాయి.
దాంతో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిషనరేట్‌ పరిధిలోని అన్ని ఠాణాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఉదయం డ్యూటీకి వచ్చినప్పుడు ఒకసారి, విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేటప్పుడు మరోసారి బ్రీత్‌ఎనలైజర్‌తో శ్వాస పరీక్షలు చేయాలని సూచించారు.
దాంతో మంగళవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ఎల్‌బీనగర్‌ ఠాణా లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు ఎల్‌బీనగర్‌ ట్రాఫిక్‌ పోలీసులు శ్వాసపరీక్షలు నిర్వహించారు.
దొరికితే ఇంటికే…
మద్యం తాగి విధుల్లోకి వచ్చినా.. వచ్చిన తర్వాత మద్యం తాగినట్లు తేలినా ఆ అధికారిపై సీపీ మహేష్‌ భగవత్‌ కఠిన చర్యలు తీసుకోనున్నారు.
ఎవరైనా పోలీస్‌ అధికారి మద్యం తాగినట్లు పరీక్షల్లో తేలితే నేరుగా ఇంటికి సాగనంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి రాచకొండ కమిషనరేట్‌ పరిఽధిలో సామాన్య ప్రజలకు ఒక న్యాయం, పోలీసులకు మరో న్యాయం అనే తేడా ఉండదు. తప్పు చేసింది పోలీసులైనా, సామాన్యులైనా శిక్ష ఒకే విధంగా ఉంటుందన్నమాట.

సీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.

About The Author