తెలంగాణ ప్రాంతంలో ఆడపడుచుకు పుట్టింటి నుండి లభించే అపురూపమైన గౌరవం, కానుక ఈ ఒడిబియ్యం.. ఇందులో ముఖ్యమైనవై పసుపు కలిపిన బియ్యం, కొత్త బట్టలు, పసుపు, కుంకుమ, సెనగపప్పు, కుడుకలు, పచ్చముగ్గు సారెగా ఇవ్వడం. ఇది అమ్మాయికి పెళ్లితో మొదలవుతుంది. అప్పటినుండి మొదలై ముత్తైదువుగా ఉన్నంతకాలం వయసు ఎంతైనా పుట్టింటినుండి అందే కానుక ఇది. మొదటిసారిగా పెళ్లి పందిట్లో ఏడు సేర్లన్నర బియ్యంతో నిండు బియ్యం అని పోస్తారు. తర్వాత కూతురు గృహప్రవేశం చేసినప్పుడు, పెళ్లి చేసినప్పుడు, లేదా బిడ్డను కన్న తర్వాత బారసాల నాడు పెళ్లప్పటిదానికంటే సగం బియ్యం అంటే పావు తక్కువ నాలుగు సేర్ల బియ్యం, కొత్తబట్టలు, పసుపు కుంకుమ మొదలైనవి కలిపి ఒడిబియ్యం పోయడం జరుగుతుంది. ఆ తర్వాత ప్రతీ ఐదేళ్ల లోపు ఒడిబియ్యం పోయాలి/పోయించుకోవాలి. లేకుంటే మంచిది కాదు అని గాఢనమ్మకం అంధరిలో… ఇందులో ఖర్చు అంటే బట్టలకే. ఇక్కడ తల్లిగారు ఇచ్చే పసుపు కుంకుమ అన్నదానికే విలువ నిస్తారు తప్ప ఖరీదుకు కాదు. ఇష్టం ఉన్నవాళ్లు బిడ్డకు బంగారం పెడతారు. దంపతులకు ఖరీదైన బట్టలు పెడతారు. అంతే కాక పుట్టింట్లో జరిగే పెళ్లిళ్లలో కూడా ఆ ఇంటి ఆడపడుచుకు ఒడిబియ్యం పోయడం తప్పనిసరి ఆచారం. ఆడపడుచు లేనివారు, పుట్టింటివారు లేనప్పుడు/రానప్పుడు ఈ విషయంలో అనుభవించే బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. అది వదులుకోలేనివారు కూతురు వరసైనవారికి బియ్యం పోస్తారు. లేదా పుట్టింటి బంధం ఉన్నవారి నుండి బియ్యం పోయించుకుంటారు. మా అమ్మాయి అత్తవారి తరఫున ఈ ఒడిబియ్యం ఆనవాయితీ లేకున్నా నేను ఇది పుట్టింటి నుండి వచ్చే పసుపు కుంకుమ తప్పకుండా ఇస్తాను అంటే మా వియ్యపురాలు ఒప్పుకున్నారు. అదే విధంగా శుభకార్యాలప్పుడు ఒడిబియ్యం పోస్తున్నాను. ఒడిబియ్యం పోయడం అయ్యింది . ఆ తర్వాత వాటిని ఏం చేస్తారు అంటే… అమ్మాయి తనింట్లో తల్లిగారిని, అత్తగారివైపు బంధువులను పిలిచి శక్త్యానుసారం వచ్చినవారికి భోజనం పెట్టడం జరుగుతుంది. తినేవాళ్లు ఐతే బియ్యం వండేరోజు నాన్ వెజ్ తప్పకుండా ఉండాలంటారు. అందుకే బియ్యం పోసినవాళ్లకంటే వండేవాళ్లకే ఎక్కువ ఖర్చు అని సరదాగా చెప్పుకుంటారు…. కాని ఈ వంకతో అందరు కలిసి సంతోషంగా భోజనాలు చేయడం జరుగుతుంది అన్న తృప్తి అందరికీ ఉంటుంది.

ఇది ఎంత ముఖ్యమంటే. కూతురు పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా పుట్టింటివాళ్లు పెట్టిన బట్టలతోనే చేయాలి. కొడుకుకు ఉపయనం చేసేరోజు ముందు ఒడిబియ్యం పోసుకుని అవే బట్టలతో కొడుకుకు జంధ్యం వేయాలంటారు. అలాగే ఒడిబియ్యం పోసుకుని అవే బట్టలతో కూతురుకు కన్యాదానం చేయాలంటారు..

About The Author