జులై 8న రాష్ట్రవ్యాప్తంగా “వైఎస్సార్ రైతు దినోత్సవం” …


జులై 8న రాష్ట్రవ్యాప్తంగా “వైఎస్సార్ రైతు దినోత్సవం” జరపాలని నిర్ణయించామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రకటించారు. సచివాలయంలోని ప్రచార విభాగంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రైతు దినోత్సవాన్ని ఒక బాధ్యతతో నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల్లో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని జమ్మలమడుగులో నిర్వహించే రాష్ట్ర స్థాయి రైతు దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయా నియోజక వర్గాల్లో శాసనసభ్యులు, మండలి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారని వెల్లడించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు పాల్గొనే కార్యక్రమాలను జిల్లా స్థాయి వేడుకలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు వైఎస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవుతున్నారని మంత్రి తెలిపారు. రైతు దినోత్సవ వేడుకల్లో ఉచిత పంటల బీమా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించి లబ్ధిదారులకు బీమా పత్రాలను అందిస్తారని మంత్రి తెలిపారు. అనుకోని పరిస్థితుల్లో అన్నదాత మృతి చెందితే వారికి రూ.7 లక్షల చొప్పున ఆర్థిక చేయూతను బీమా రూపంలో అందిస్తామని చెప్పారు. రైతులకు అండగా ఉంటామని వారికి భరోసా కల్పిస్తూ ప్రభుత్వం రైతుల్లో ధీమాను పెంపొందిస్తామన్నారు. ఈ సదస్సుల్లో రైతు సమస్యలపై విజ్ఞప్తులను కూడా స్వీకరిస్తామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన ఉత్తమ రైతులను ఎంపిక చేసి అవార్డులతో వారిని సన్మానిస్తామన్నారు. తమ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల దన్నుగా నిలుస్తుందని మంత్రి చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జులై 8న శంకుస్థాపన చేస్తారని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఈ పరిశోధన సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు.

About The Author