మాకు మొగుళ్లుగా మగాళ్లు వద్దు…
మగవాళ్లపై నమ్మకం లేక ఇద్దరు యువతులు హనుమంతుడి సాక్షిగా ఒక్కటయ్యారు. దండలు మార్చుకొని వివాహం చేసుకున్నారు. ఈ తతంగమంతా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాన్పూర్‌కు చెందిన ఇద్దరు యువతులూ కళాశాలలో చదివే రోజుల నుంచే మంచి స్నేహితులు. ఇద్దరూ ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. ఈ క్రమంలోనే వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వాలని.. కలిసి నడవాలని అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. అబ్బాయిలపై నమ్మకం లేక యువతులిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ఇద్దరూ కాన్పూర్ నుంచి వారణాసి జిల్లాలోని విర్భన్‌పూర్‌లోని రొహానియా ప్రాంతానికి వచ్చి అక్కడ హనుమాన్ ఆలయ పూజారిని ఆశ్రయించారు. తమకు వివాహం జరిపించాలని కోరారు. ఆ ఇద్దరమ్మాయిలతో బంధువులెవరూ రాకపోవడంతో స్థానిక గ్రామస్థులే పెళ్లిపెద్దలుగా నిలిచారు. ఇద్దరు యువతులూ తమను సంప్రదించారనీ.. బంధువులెవరూ లేకపోవడంతో తామే హనుమంతుడి సాక్షిగా వారిద్దరికీ వివాహం జరిపించామని స్థానికులు, ఆలయ పూజారి తెలిపారు.