వానలు కురవాలని వరుణయాగం పూర్ణాహుతితో పరిసమాప్తి…
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: అనావృష్టి దోష నివారణ.. లోకకల్యాణార్ధమై సమృద్ధిగా వర్షాలు కురిసి సుభిక్షత కల్పించాలంటూ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం చేపట్టిన శ్రీవర్షపాశుపత హరనపూర్వక వరుణయాగం ఆదివారం ముగిసింది.హరి హరుల ఆలయాల మధ్య ఏర్పాటైన యాగశాలలో ముగింపు సందర్భంగా మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకం, వరుణయాగ జపం, వర్షపాశుపత హవనం, మూలమంత్ర హవనం, జయాధి హోమం, బలిహరణ పర్వాలను చేపట్టారు. అనావృష్టి నివారణ కోసం తలపెట్టినయాగంతో వరుణ దేవుడు కరుణించాలని రుశ్య శృంగ మహర్షిని వేడుకుంటూ ఆరాధనలు జరిపారు. శైవాగమ ఆచారంగా మహాశివుడిని కొలుస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు. వానలు జోరుగా కురువాలంటూ వరుణ దేవుడిని ఆరాధిస్తూ చేపట్టిన ప్రత్యేక పూజల్లో అఖండ దీపారాధన, స్వస్తివాచనం, చతుస్థానార్చన, కలశ స్థాపన, మండపారాధనలు చేపట్టారు. మహాశివుడికి అభిషేకాలు చేపట్టి పూజించారు.
బండ పాయసం
యాగ నిర్వహణలో వరుణ దేవుడిని ఆరాధిస్తూ చేపట్టిన పూజల అనంతరం నివేదన పర్వాన్ని నిర్వహించారు. ఆరాధన క్రమంలో ప్రసాద నివేదన సంతరించుకుంటుందని రుత్వికులు తెలిపారు. వరుణ దేవుడికి అత్యంత ప్రీతికరమైన బండ పాయసం నిర్వహించారు. బెల్లంతో తయారైన పాయసాన్ని బండపై వరుద రూపంలో నివేదించి ఆ ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. ఈ పర్వంతో వరుణ భగవానుడు అధిక వర్షాలు కురిపిస్తారన్న ఆకాంక్షను నిర్వాహకులు వెల్లడించారు. మూడోరోజు జరిగిన పూర్ణాహుతితో యాగం పరిసమాప్తమైందని శివాలయ పూజారులు నర్సింహయ్య పంతులు, యాజ్ఞికులు, సందీప్‌శర్మ, రాజేశ్వరశర్మ వెల్లడించారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ధర్మకర్త నరసింహమూర్తి, పేష్కార్ శివకుమార్, ఏఈవోలు భాస్కర్‌శర్మ, కృష్ణ, రామ్మోహన్‌రావు, రమేష్‌బాబు పాల్గొన్నారు.