అద్భుతంగా యాదాద్రి ఆలయ నిర్మాణం… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి


అద్భుతం… ఆధ్యాత్మిక నగరిగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం కాబోతుందని, తిరుమల తిరుపతి తరహాలో యాదాద్రి నిర్మాణ పనులు జరుగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా గురువారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ప్రధానార్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రధాన దేవాలయం, మంటపం, గర్భగుడి, బాహ్య ప్రాకారాలు, అంతర ప్రాకారాలు, మాడవీధులు, రథశాల, వ్రత మంటపం, ధ్వజస్తంభం, ప్రసాద కౌంటర్లు, శివాలయ పనులను మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును చూసి సంతృప్తి వ్యక్త పరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదాద్రి క్షేత్రాన్ని పునర్నిర్మించడం ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. మరోవైపు టెంపుల్ సిటీలో కాటేజీల నిర్మాణం కోసం సమాతరంగా పనులు చేపట్టనుడటంతో సర్వత్రా హర్షం వ్యక్తమువుతుందన్నారు. యాదాద్రి ప్రధానాలయం, శివాలయం, గర్భాలయం, మండప నిర్మాణంతోపాటు అన్ని ప్రాంతాల్లో పూర్తిగా కృష్ణశిలలతో నిర్మిస్తున్న శిల్పుల కృషి అమోఘమైందని చెప్పారు. పూర్తిగా దివ్యమైన ఆలయం, శివాలయం నిర్మాణం చాలా బాగుందని చెప్పారు. పనులు పూర్తయ్యాక అద్భుతమైన దివ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ దేవస్థానం కాబోతుందన్నారు. 1000 ఎకరాల్లో టెంపుల్ సిటీ నిర్మాణ జరుగుతున్న విధానంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. స్వామివారి దర్శనం కొరకు వచ్చే భక్తుల వసతి కోసం కాటేజీల పనులు, వీఐపీల వసతి, సూట్ల నిర్మాణ పనులు శరవేగంగా నిర్మాణమవుతున్నాయని చెప్పారు. ఆలయ పునఃప్రారంభ తేదీని ముఖ్యమంత్రి కేసీఆరే నిర్ణయిస్తారని తెలియజేశారు. హైదరాబాద్‌కు అత్యంత చేరువలో ఉన్న యాదాద్రి టెంపుల్ అత్యంత అద్భుత ప్రాంతంగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ నిర్మాణ స్థపతులు, ఇంజినీర్లు, అర్చకులు పాల్గొన్నారు.

About The Author