అసదుద్దీన్ ఓవైసీకి అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్…
పార్లమెంట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వర్సెస్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. తమకు ఎవరినీ భయపెట్టే ఉద్దేశం లేదని, ఒకవేళ ఎదుటి వారు వారి మెదడులో అలా ఆలోచిస్తే మాత్రం తాము చేయగలిగిందేమీ లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఒవైసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సవరణ బిల్లుపై బీజేపీ సభ్యుడు సత్యపాల్ సింగ్ మాట్లాడుతుండగా ఈ వాగ్వాదం జరిగింది.
సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ… హైదరాబాదులోని ఓ కేసు విషయంలో ఓ నాయకుడు అప్పటి పోలీస్ కమిషనర్‌ను భయపెట్టారని, కేసు విచారణలో జోక్యం చేసుకున్నారని, ఒకవేళ ఆయన చెప్పినట్లు వినకపోతే ఆ అధికారిని బదిలీ చేస్తానని ఆ నాయకుడు బెదిరించారని సత్యపాల్ సింగ్ అన్నారు. ఈ విషయం తనకు బాగా తెలుసని, అప్పట్లో నేను ముంబాయ్ పోలీస్ కమిషనర్‌గా ఉండేవాడినని సింగ్ వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా సభలో అలజడి మొదలైంది. మధ్యలో కల్పించుకున్న ఒవైసీ దీనికి సంబంధించిన ఆధారాలేవైనా మీవద్ద ఉంటే తక్షణమే సభకు సమర్పించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన హోంమంత్రి షా.. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్న సమయంలో తాము అడ్డుపడలేదని, అలాగే తాము మాట్లాడే సమయంలో కూడా ప్రతిపక్ష సభ్యులు అడ్డుతగలరాదని తెలిపారు.
ప్రతిపక్ష సభ్యులకు ఇతర పక్షాల వారి వాదన వినడానికి తగిన ఓపిక ఉండాలంటూ అమిత్‌షా ఒవైసీ వైపు వెలెత్తి చూపిస్తూ అన్నారు. దీంతో ఒవైసీ ఒక్కసారిగా ఆందోళన వ్యక్తంచేస్తూ తనవైపు వేలెందుకు ఎత్తి చూపిస్తున్నారని, తననెవరూ భయపెట్టలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన షా… తామెవరినీ భయపెట్టలేదని, కేవలం సభ్యులు మాట్లాడేదానిని వినాలని మాత్రమే చెప్పానని స్పష్టం చేశారు. మీ మెదడులో భయం ఉంటే నేనేమీ చేయగలను? అంటూ అమిత్‌షా ఒవైసీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.