ఆ పొలం రైతులకు విశ్వవిద్యాలయం!
130 ఎకరాల వ్యవసాయ క్షేత్రం… అందులో ఒక్క బోరు కూడా వేయకుండా రకరకాల పంటలు పండిస్తూ లాభాల్ని అందుకుంటున్నారు మల్లికార్జున గుప్తా అనే రైతు. రసాయన ఎరువులు వాడకుండా, ఒక్క వర్షపు నీటి చుక్కనూ పాడిపశువుల విసర్జితాలనూ చివరికి చెట్టు నుంచి రాలిన ఆకులను కూడా వృథా పోనివ్వకుండా, సమీకృత విధానంలో ఆయన సాగిస్తోన్న సేద్యం ఎంతో మంది రైతులకు కొత్త పాఠాలు నేర్పిస్తోంది.అడవిని తలపించే సుబాబుల్ చెట్లూ, ఏపుగా పెరిగిన వాణిజ్య పంటలూ, చుట్టూ పరచుకున్న చెరువులూ, సందడి చేసే లేగ దూడలూ పాడి పశువులూ… మొత్తంగా మల్లికార్జున గుప్తా క్షేత్రం ఓ మినీ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని తలపిస్తుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గోపాలపురంలోని ఆయన పొలం ఒకప్పుడు కరవుకు విలవిల్లాడిన బంజరు భూమి. అలాంటి నేలమీద ప్రకృతిహిత విధానాల్లో సేద్యం చేస్తూ లక్షల రూపాయల ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు గుప్తా. ఆయన ఒకప్పుడు మిల్లు వ్యాపారి. రోజూ ఆయన దగ్గరకు వచ్చే రైతుల సమస్యలూ, పంటలు పండించడానికి వాళ్లు పడే ఇబ్బందులూ చూసి చలించిపోయేవారు. క్రమంగా వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవడంతో దాన్నుంచి తప్పుకొని వ్యవసాయం చేయాలనుకున్నారు. అది చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయినా ఇతరులకంటే భిన్నంగా వ్యవసాయం చేసి పంటలు పండిస్తానని స్నేహితులూ, బంధువులతో ఆయన నమ్మకంగా చెప్పేవారు. వాళ్ల సాయంతోనే ఆరేళ్ల క్రితం 130 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అప్పటికే చుట్టుపక్కల లెక్కలేనన్ని బోర్లతో భూగర్భ జలాలు దాదాపు ఎండిపోయాయి. దాంతో బోర్ల మీద ఆధారపడకుండానే పంటలు పండించాలనుకున్నారు.
• నలభై ఎకరాల్లో చెరువులు
నీటి కోసం బావులూ బోర్లను కాకుండా గుప్తా వర్షపు నీటినే నమ్ముకున్నారు. తన పొలం చుట్టుపక్కల పడే ఒక్క వర్షపు నీటి చుక్కను కూడా వృథా చేయకూడదనుకున్నారు. దాని కోసం నలభై ఎకరాల విస్తీర్ణంలో ఏడు చెరువులను తవ్వించారు. ఒకదానితో మరొకటి అనుసంధానం చేస్తూ పైపులైన్లు వేయించారు. చెరువులు నిండితే మిగతా నీరు వృథా పోకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదటి చెరువుకు ఆనుకొని ఓ చిన్న డ్యామ్ నిర్మించి దానికి షట్టర్లు ఏర్పాటు చేశారు. గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఆ నీళ్లను దిగువ ప్రాంతానికి పంపేలా మార్గం రూపొందించారు. ఆ వరద నీటిని పూర్తిస్థాయిలో ఒడిసి పట్టేందుకు నీరు వెళ్లే మార్గానికి అటూ ఇటూ వూట బావులు తవ్వించారు. అదృష్టం కొద్దీ వ్యవసాయం మొదలుపెట్టిన కొత్తల్లో వర్షాలు బాగా కురవడంతో ఆ చెరువులు నిండాయి. దాంతో భద్రపరచుకున్న నీటితోనే వ్యవసాయాన్ని కొనసాగించారు. గుప్తా పుణ్యమా అని చుట్టుపక్కలా భూగర్భ జలాల మట్టం పెరిగింది. ఒకప్పుడు పక్క పొలంలో రైతులు మోటారు వేస్తే గంటపాటు నీళ్లు రావడం కూడా గగనమయ్యేది. కానీ ఇప్పుడు ఏకధాటిగా ఐదు గంటలు వస్తుండటం విశేషం.
• వ్యర్థాలే ఎరువులు
పంటలకు అనుబంధంగా పాడి పశువులనూ పెంచితే ఆదాయంతోపాటు ఎక్కువ ప్రయోజనాలూ, ఎక్కువ మందికి ఉపాధీ దక్కుతాయని గుప్తాకి అనిపించింది. దాంతో 45 మేలు జాతి ఆవులతో పాడి పరిశ్రమ నెలకొల్పారు. 400 పైచిలుకు గొర్రెలూ, మేకలనూ పెంచుతున్నారు. వీటికి మేత కోసం 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. మరోపక్క ఎనభై ఎకరాల్లో పంటలకు బిందు సేద్యం పద్ధతిలోనే నీరందిస్తున్నారు. దాని వల్ల చాలా నీరు ఆదా అవుతోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనాలుండే సుబాబుల్ తోటను 20 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వాటి ఆకులు పశువులకు మేతగా పనికొస్తున్నాయి. టన్ను సుబాబుల్ కర్ర ధర సుమారు రూ.3500 పలుకుతుంది. దాంతో ఎకరాకు 30 టన్నులు వచ్చినా పాతిక లక్షల వరకూ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందంటారు గుప్తా. ఆయన క్షేత్రంలో పశువుల విసర్జితాలు కూడా వృథా కావు. పశువుల పాకలోపడ్డ పేడనూ, మూత్రాన్నీ కాలువ ద్వారా నేరుగా ఓ చెరువులోకి వెళ్లేలా ఏర్పాటుచేశారు. ఆ నీటిని రెండు వారాలకోసారి పంటలకు పెట్టడంతో అవే సేంద్రియ ఎరువుల్లా పనిచేస్తున్నాయి. దాంతో ఇతర ఎరువుల అవసరం రాలేదు. ఆ చెరువుల్లో చేప పిల్లలనూ పెంచుతూ తాను ఆదాయం పొందడంతో పాటు గంగపుత్రులకూ ఉపాధి కల్పిస్తున్నారు.
• విద్యార్థులకూ పాఠాలు
గుప్తా తాను సొంతంగా నేర్చుకున్న విధానాలకు తోడు నీటి పారుదల శాఖ సహాయ ఇంజినీరు నాగేశ్వరరావు సూచనలూ, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల సహకారంతో వ్యవసాయ క్షేత్రంలో ఇన్ని ఫలితాలు రాబట్టారు. గుప్తా పద్ధతులు తెలుసుకునేందుకు రైతులతో పాటు ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అశ్వారావుపేట వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి నిత్యం విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. కేవలం వర్షపు నీటిని నమ్ముకొని నూట ముప్ఫయ్ ఎకరాల్లో గుప్తా సృష్టిస్తోన్న అద్భుతాలకు గుర్తింపుగా ప్రభుత్వం గతేడాది జిల్లా ఉత్తమ రైతు పురస్కారం అందించింది. ‘భవిష్యత్తులో దీన్ని వ్యవసాయ పర్యటక క్షేత్రంగా మార్చాలన్నది నా లక్ష్యం. నా పొలంలోకి వచ్చే వర్షపు నీటితో చెరువులు నిండిపోయి, ఇంకొంత నీరు గోదావరిలో కలుస్తోంది. వాటిని కూడా అడ్డుకుని అందరం ఉపయోగించుకోగలిగితే ఎవరికీ బోర్లపైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు’ అంటారు గుప్తా. ప్రకృతి వనరులను అందరికీ సమానంగా ఇస్తుంది. వాటిని ఎవరు ఎలా వాడుకుంటున్నారనే దానిపైనే విజయాలు ఆధారపడి ఉంటాయి. గుప్తా కథే అందుకు ఉదాహరణ.