పాపం పిచ్చితల్లి .. బిడ్డకు జన్మనిచ్చింది .. బిడ్డను పందుల గుంపులో పారేసింది..


ఎవరో గుర్తుతెలియని కామాంధుల వాంఛకు ఆ పిచ్చి మహిళ బలైంది. ఫలితంగా ఆమె గర్భం దాల్చి పురుటినొప్పులతో బాధపడుతూ శనివారం(ఈ నెల 20వ తేదీన) రాత్రి సమయంలో ఆదోని పట్టణం శిరుగుప్ప కూడలి వద్ద రహదారి పక్కనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఏంచేస్తోందో తెలియని పరిస్థితుల్లో తన బిడ్డను పక్కనే పందుల గుంపు వద్ద పడేసింది. దగ్గరికి వెళ్తే అందరిపై రాళ్లు విసురుతూ స్థానికులను ఇబ్బంది పెట్టింది. అక్కడే ఉన్న హోటల్‌ నిర్వాహకుడు షాషావలి, అతని తల్లి షేకున్‌బీ, పెద్దమ్మ మున్నాబీ గుర్తించి ఆ పసి బిడ్డను పందుల మంద నుంచి కాపాడి చికిత్స కోసం స్థానిక స్త్రీల, చిన్నపిల్లల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సీడీపీవో సఫరున్నీసాబేగం, ఒకటో పట్టణ పోలీసులు ముందుగా ఆస్పత్రికి వెళ్లి శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం కర్నూలులోని శిశు సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించడంతో అక్కడి సిబ్బంది భవానీ ఆస్పత్రికి వచ్చారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ మాధవీలత, డాక్టరు సుధా శిశువు ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి ఆరోగ్యంగా ఉండటంతో ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో కర్నూలులోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ మహిళపై గతంలో కొందరు నోటిలో వస్త్రాలు కుక్కి అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించగా స్థానికులు గుర్తించడంతో నలుగురు యువకులు పారిపోయారని స్థానికులు చెబుతున్నారు.
బాలింతకు నిత్య నరకం
సాధారణంగా గర్భిణి ప్రసవం జరిగిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది మానసిక స్థితి సరిగా లేని మహిళ మూడు రోజులుగా చలికి, వానకు, ఎండకు తట్టుకుంటూ రహదారిపైనే నరకం అనుభవించింది. ఆలస్యంగా స్పందించిన అధికారులు, పోలీసులు మానవత్వాన్ని చాటారు. ఘటనా స్థలానికి చేరుకుని మహిళ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఆ బాలింత వస్త్రాలు మార్చి కడుపు నిండా అన్నం పెట్టారు.

About The Author