తెలంగాణ పోలింగ్‌ను విజయవంతంగా…?


తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7న జరిగే పోలింగ్‌ను విజయవంతంగా నిర్వహించడం అనేది ఇ.వి.ఎం. వివిప్యాట్‌లను సమర్థంగా, విజయవంతంగా నిర్వహించుకోవడం మీద ఎక్కువగా ఆధారపడి ఉందని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ బుద్ధ ప్రకాశ్ జ్యోతి ఉద్భోధించారు. రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు, నోడల్ అధికారులకు మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన శిక్షణా శిబిరానికి అధ్యక్షత వహిస్తూ, ఇక్కడ శిక్షణ అనంతరం క్షేత్ర స్థాయిలో కిందిస్థాయి సిబ్బందికి పోలింగ్ యంత్రాల నిర్వహణలో మరింత అవగాహన కల్పించి ఎటువంటి లోటుపాట్లకు అవకాశం ఇవ్వకుండా పోలింగ్ సక్రమంగా , పకడ్బందీగా జరిగేటట్లు చూడాలని ఆయన సూచించారు.
కర్ణాటక డిప్యూటీ సి.ఇ.ఓ, జాతీయ స్థాయి ట్రైనర్ శ్రీ వి. రాఘవేంద్ర ఆచరణాత్మకంగా ఇచ్చిన శిక్షణకు రాష్ట్రంలోని ఎన్నికల విధుల్లో ఉన్న 210మంది హాజరయ్యారు. వీరిలో 26 మంది నోడల్ అధికారులు, 128 మంది ఐటి సంబంధిత ఉద్యోగులు కూడా ఉన్నారు.పోలింగ్‌కు ముందు ఇ.వి.ఎంల పనితీరును పరీక్షించడం, వాటిపై అభ్యర్థుల పేర్లు, ఎన్నికల చిహ్నాలను కచ్చితంగా అమర్చడం, ఇ.వి.ఎంలను వివిప్యాట్‌లతో అనుసంధానించడం, నమూనా పోల్ నిర్వహించి అంతా సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించుకోవడం, పోలింగ్ జరిగే సమయంలో ఏదయినా సమస్య తలెత్తి వాటి స్థానంలో ప్రత్యామ్యాయ యంత్రాలను అమర్చేటప్పడు తీసుకోవలసిన జాగ్రత్తలు, వివిప్యాట్ యంత్రాలను పనితీరును పరీక్షించి చూసుకోవడం వంటి పోలింగ్ రోజు జాగ్రత్తలపై ఈరోజు పోలింగ్ సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించారు.ఈ శిక్షణ కార్యక్రమములో ఈవీఎం నోడల్ ఆఫీసర్ కిషన్ రావు, అసిస్టెంట్ సెక్రటరీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About The Author