మండపేటలో కిడ్నాప్‌కు గురైన బాలుడు జషిత్‌ క్షేమం..

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో కిడ్నాప్‌కు గురైన బాలుడు జషిత్‌ క్షేమంగా ఉన్నాడు. మూడు రోజుల క్రితం బాలుడు జషిత్‌ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. కిడ్నాపర్లు బాలుడిని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు రోడ్‌లో జషిత్‌ను వదిలి వెళ్లారు. తెల్లవారు జామున బాలుడిని కిడ్నాపర్లు వదిలి వెళ్ళారు. బాలుడిని గుర్తించిన స్థానిక కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుడికి సంబంధించిన వీడియోలు కూడా పంపినట్లు సమాచారం. వీడియోలో బాలుడు హుషారుగా ఉన్నట్లు, యాక్టివ్‌గా మాట్లాడుతున్నట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. బాలుడు క్షేమంగా ఉన్న సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాలుడిని రక్షించేందుకు పోలీసులు అన్ని విధాలా కృషి చేశారు. బృందాలుగా విడిపోయి గాలించిన విషయం తెలిసిందే. బాలుడిని కాపాడేందుకు పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకోవడాన్ని గుర్తించిన కిడ్నాపర్లు భయపడి బాలుడిని క్షేమంగా వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు కు అప్పగించిన పోలీసులు

బిడ్డను చూసి కన్నీరు మున్నీరైన తల్లి..

అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ మూడురోజులపాటు కంటికి కనపడకపోయే సరికి ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. అసలు ఎక్కడున్నాడు, ఉన్నాడో లేడో, తిన్నాడో లేదో అని ఒకటే ఆవేదన. తీరా బిడ్డ కళ్లకు కనపడటంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పోలీసుల చేతుల్లోనుంచి బిడ్డను అక్కున చేర్చుకుని కన్నీరుమున్నీరైంది. కిడ్నాపర్లు రాయవరం మండలం కుతుకురూలులో జషిత్ ను విడిచిపెట్టి వెళ్లడంతో ఎస్పీ నయీం బిడ్డను తీసుకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. బాలుడిని గుర్తించడంలో సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కిడ్నాపర్లను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. వ్యక్తిగత కారణాలే బాలుడి అపహరణకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

About The Author