సింధూకి ఇచ్చినంత ప్రాధాన్యత హిమాదాస్ కి ఇవ్వకపోవడానికి కారణం కుల వివక్షా?


“తెలుగు పత్రికలలో సింధూ విజయం గురించి దాదాపు అన్ని పత్రికలూ మొదటి పేజీలో రాశాయి, హిమాదాస్ గారి విషయంలో రాయలేదు. దీనికి కారణం కులం” అని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది?)
మనదేశంలో చాలా వర్గాలకు మన సమాజంలో కుల వివక్ష ఉండటం, పెరగడం చాలా అవసరం. వీళ్ళకి కుల వివక్షతో ఉన్న సంబంధం, గజ్జికి, జాలిమ్ లోషన్ తో ఉన్న సంబంధం వంటిది. గజ్జి పోతే జాలిమ్ లోషన్ తో అవసరం కూడా పోతుంది, అలానే మన సమాజంలో కుల వివక్ష పోతే కొన్ని వర్గాలతో అవసరం పోతుంది, దానివకన వారి ఆదాయం కూడా పోతుంది. కాబట్టి ఈ వర్గాలు ప్రతీ దాంట్లో కుల వివక్షని వెతుకుతారు, ప్రచారం చేస్తారు. సింధు మొదటి సారి ఒక పెద్ద టోర్నమెంట్ గెలిచినప్పుడు దేశమంతా ఆవిడ కులం గుతించి వెతికారు అని తెగ ప్రచారం చేశారు, గుర్తుందా? అది అబద్దం అని తరువాత తేలింది, అది వేరే విషయం. కానీ మొదట్లో చాలా మంది ఇది నిజం అనే నమ్మారు.
ఇప్పుడు మళ్లీ అటువంటి ప్రయత్నమే జరుగుతోంది. దీని కోసం హిమాదాస్ గారి పేరును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇంతకు ముందు హిమాదాస్ గారికి మీడియాలో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని దానికి కారణం ఆవిడ కులం అని అన్నారు. ఇప్పుడేమో సిందూకి ఇప్పుడు ఇచ్చినంత ప్రాధాన్యత అప్పుడు హిమాదాస్ కి ఇవ్వలేదని, దానికి కూడా కారణం కులం అనే అంటున్నారు. తమ వాదన నిజం అని నిరూపించడానికి కొన్ని తెలుగు పత్రికలు చూపుతున్నారు.

(గమనిక: నాకు హిమాదాస్ గారి కులం ఏమిటో తెలియదు)
ఒకసారి ఇప్పుడు ఈ విషయాన్ని విశ్లేషిద్దాం.
1. ప్రతీ దేశంలో ప్రజలు కొన్ని క్రీడలను ఎక్కువగా ఇష్టపడతారు. ఆ కారణం వలన ఆ క్రీడలకు సంబంధించిన విషయాలు మాధ్యమాలలో ఎక్కువగా రావడం సహజం. మాధ్యమాలు, కనీసం ఇటువంటి విషయాలలో ప్రజలు ఎక్కువ ఏ విషయాలని గురించి చదువుతారు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని రాయడాన్ని నేను తప్పుబట్టను.
2. ఒకప్పుడు బాడ్మింటన్ కి కూడా మన దేశంలో పెద్దగా ప్రచారం ఉండేది కాదు. కానీ గోపిచంద్ గారు ఆల్ ఇంగ్లండ్ బాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచాక, పరిస్థితులలో మార్పు ప్రారంభం అయ్యింది. తరువాతి కాలంలో ఆయన ప్రపంచ స్థాయి శిక్షణా కేంద్రం స్థాపించడం, ఆయన సంస్థ నుండి వచ్చిన క్రీడాకారులు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పథకాలు గెలవడంతో మెల్లగా ఈ క్రీడ పట్ల ప్రజలలో ఆసక్తి, దానితో పాటు మీడియా ఇచ్ఛే ప్రాధాన్యత పెరుగుతూ వచ్చాయి. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, K శ్రీకాంత్ వంటి ఎందరో క్రీడాకారులు గోపీచంద్ గారి శిక్షణా కేంద్రం నుండి వచ్చారు.
ప్రస్తుతం క్రికెట్ తరువాత అత్యధిక ప్రజాధారణ ఉన్న క్రీడ బాడ్మింటన్ అని కొండరు క్రీడాపండితుల అభిప్రాయం. అథ్లెటిక్స్ కి మన దేశంలో ప్రస్తుతానికి అంత ప్రజాదరణ లేదు. హిమాదాస్ గారి ప్రేరణ వలన అది జరగాలి అని కోరుకుందాం.
కాబట్టి మాధ్యమాలు ప్రాధాన్యత ఇచ్చింది సింధూకో, ఆవిడ కులానికో కాదు, బాడ్మింటన్ క్రీడకి. హిమాదాస్ గారు బ్యాడ్మింటన్ లో విజయాలు సాధించి ఉంటే ఆవిడకి కూడా మాధ్యమాలు ఇలానే ప్రాధాన్యత ఇచ్చేవి. నేను మీడియాని సమర్ధించడం లేదు, అలా అని విమర్శించడం కూడా లేదు. ఇందులో కుల ప్రస్తావన లేదు అని మాత్రమే చెప్తున్నాను.
అదే విధంగా క్రికెట్ లో సాధించే విజయాలకు బాడ్మింటన్ కన్నా 100 రేట్లు ఎక్కువగా మాధ్యమాలు ప్రాధాన్యత ఇస్తాయి. కారణం భారతీయులు క్రికెట్ ని ఎక్కువగా ఇష్టపడటమే. కాబట్టి ఇది కేవలం ప్రజాధారణకి సంబంధించిన విషయమే కానీ, కులానికి సంబంధించినది కాదు
3. సింధూ గారి విజయాన్ని గురించి మన పత్రికలు పతాక శీర్షికలలో రాయడాన్ని చూపించి, కొందరు “హిమాదాస్ గురించి ఇలా ఎందుకు రాయలేదు? దానికి కారణం కులమే” అంటున్నారు. చాలా మంది ఈ విషయాన్ని నమ్మేస్తున్నారు కూడా. ఇదే కమ్యూనిస్టుల తెలివి. లేని వివాదాన్ని సృష్టించడంలో వారు సిద్ధహస్తులు.
సింధూ గారికి తెలుగు పత్రికలు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఆవిడ తెలుగు అమ్మాయి అవ్వడం. అంతే తప్ప కులం కాదు. తెలుగు పత్రికలు ఎలా అయితే సింధూకి ప్రాధాన్యత ఇచ్చాయో, అస్సామీ పత్రికలు అలానే హిమాదాస్ గారికి ప్రాధాన్యత ఇచ్చాయి. అంతే తప్ప ఇందులో కులం ప్రస్తావన లేదు.
4. పోనీ వాదన కోసం వీరు చేప్పేది నిజమే అనుకుందాం. మాధ్యమాలు కులం అనే కారణం వల్లనే సింధూకి ప్రాధాన్యత ఇచ్చి, హిమాదాస్ కి ప్రాధాన్యత ఇచ్చాయి అనుకుందాం. అప్పుడు కూడా కులవివక్ష పాటించేది మాధ్యామాలకి చెందిన వ్యక్తులే అవుతారు కానీ, మన సమాజం కాదు. హిమాదాస్ గారిని దేశమంతా నెత్తిన పెట్టుకుంది. సామాజిక మాధ్యామాలని పరిశీలించే ఎవరికైనా ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.
కాబట్టి ఇక్కడ కుల వివక్ష అనే సమస్య అసలు లేదు. “కులవివక్ష వ్యాపారుల” ఇటువంటి నీచ వ్యూహాలని మనందరం తిప్పికొట్టాలి

About The Author