అహోబిలం ఆలయం – :

ఈ పుడమి మీద ఉన్న నాలుగు దివ్యమైన నరసింహ క్షేత్రాలలో అహోబిల క్షేత్రం ఒకటి. రాక్షసుడైన హిరణ్యకశ్యపుని సంహరించడానికి తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి స్తంభమునందు, ఉద్భవించిన స్థలమే ఈ అహోబిలక్షేత్రము. ఈ స్థల పురాణం గురించి వ్యాస మహర్షి సంస్కృతంలో బ్రహ్మాండపురాణం అంతర్గతంలో 10 అధ్యాయాలు, 1046 శ్లోకములతో అహోబిలం గురించి వ్రాయబడింది

దట్టమైన అడవి, క్రూర మృగాలకు ఆలవాలంగా అహోబిలం ఉంది. అహోబిలంలో నరసింహ స్వామి కొలువై యున్నాడు. ఈ అహోబిల పుణ్యక్షేత్రానికి “సింగవేల్ కుండ్రం” అను పేరిట పిలుస్తారు. ఈ క్షేత్రం హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామి పేరిట వెలిసింది. ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కనిపిస్తాడు కనుక ఈ క్షేత్రానికి “నవ నరసింహ క్షేత్రం” అనే మరో పేరు కూడా ఉంది.
అహోబిల నరసింహస్వామి,
వరాహ నరసింహస్వామి,
మలోల నరసింహస్వామి,
యోగానంద నరసింహస్వామి,
భావనా నరసింహస్వామి,
కారంజ నరసింహస్వామి,
ఛత్ర వడ నరసింహస్వామి,
భార్గవ నరసింహస్వామి, జ్వాలానరసింహస్వామిగా
నవ నరసింహుడిగా స్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై భాసిల్లుతున్నాడు.
ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం అనబడే రెండు పర్వతాలను ఈ క్షేత్రం కలిగి ఉంది. ఎగువ అహోబిలం చేరుకోవాలంటే దిగువ అహోబిలం నుంచి ఆరు కి.మీల బస్సు ప్రయాణం చేయాలి. ఈ క్షేత్రంలోని దేవుడు తొమ్మిది విగ్రహ రూపాలలో కనిపిస్తాడు. నవగ్రహాల కన్నా నవ నరసింహుని శక్తి అధికమని భక్తుల విశ్వాసం.

అహోబలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలాన్ని అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో ఉంది. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలంలో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్థంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరప భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణ్ణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. దిగువ అహోబలంలో వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది.

About The Author