ఇది నిజంగా అద్భుతం..


చనిపోయిన మహిళ నుంచి సేకరించిన గర్భసంచిని ఓ మహిళకు అమర్చి విజయం సాధించారు బ్రెజిల్‌ వైద్యులు. ఆమెకు జన్మించిన బిడ్డకు ప్రస్తుతం ఏడాది వయసు నిండటంతో పాటు.. ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని.. వైద్య చరిత్రలోనే ఇది ఓ కొత్త అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కథనాన్ని ‘ద లాన్‌సెట్‌ మెడికల్‌ జర్నల్‌’ ప్రచురించింది.

పుట్టుకతోనే గర్భసంచి లేదు..
జన్యు లోపం కారణంగా ఓ మహిళకు పుట్టుకతోనే గర్భసంచి లేదు. 4500 మందిలో ఒకరికి వచ్చే మేయర్‌-రాకిటాన్స్‌కీ-కస్టర్‌- హాసర్‌ అనే సిండ్రోమ్‌ కారణంగా ఆమెకు తల్లి అయ్యే అవకాశమే లేకుండా పోయింది. ఈ క్రమంలో ఆమె వైద్యులను సంప్రదించారు. గర్భసంచి మార్పిడి చేయడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో చనిపోయిన 40 ఏళ్ల మహిళ నుంచి గర్భసంచిని సేకరించి 2016లో సదరు మహిళకు అమర్చారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ఆమెకు రుతుస్రావం మొదలైంది. ఈ క్రమంలో 2017లో గర్భం దాల్చిన ఆమె అదే ఏడాది డిసెంబరు 15న ఆడ శిశువుకు(సిజేరియన్‌ సెక్షన్‌) జన్మనిచ్చారు. పుట్టిన సమయంలో రెండున్నర కిలోల బరువు ఉన్న ఆ శిశువు ప్రస్తుతం ఏడున్నర కిలోల బరువు పెరిగిందని..పూర్తి ఆరోగ్యంతో ఉందని జర్నల్‌ పేర్కొంది.

ఇది నిజంగా అద్భుతం..
చనిపోయిన మహిళ గర్భసంచి మార్పిడి ద్వారా జన్మించిన బిడ్డ ఆరోగ్యంగా ఉండటం వైద్య చరిత్రలో చోటు చేసుకున్న గొప్ప పరిణామమని సావో పౌలో యూనివర్సిటీ హాస్పటల్‌ డాక్టర్‌ డానీ ఈజెన్‌బర్గ్‌ పేర్కొన్నారు. తాము నిర్వహించిన ఈ ఆపరేషన్‌ సక్సెస్‌ కావడంతో చనిపోయిన తర్వాత గర్భసంచిని దానం చేసే దాతల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

About The Author