ఎన్నికల ప్రశాంత నిర్వహణకు రాష్ట్రపోలీసులు సర్వసన్నద్ధం…

ఎన్నికల ప్రశాంత నిర్వహణకు రాష్ట్రపోలీసులు సర్వసన్నద్ధం…

తెలంగాణ శాసనసభకు చెందిన 119 ఎసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 7వ తేదీన జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి వీలుగా మొత్తం 31 జిల్లాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు రాష్ట్ర పోలీస్ విభాగం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో ముందస్తు ఏర్పాట్లలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రధాన కార్యాలయంలోనూ, జిల్లా ప్రధాన కేంద్రాలలోనూ, కమీషనరేట్లలోనూ అన్ని స్థాయిలలోని అధికారులకు శిక్షణా శిబిరాలు నిర్వహించి నమూనా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, ఎన్నికల సందర్భంగా జరిగే హింసాత్మక సంఘటనలవంటి అంశాలపై అవగాహన కల్పించడం, సంక్షోభ నివారణకు సూచనలు ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణకు శాంతి భద్రతల అదనపు డిజిపిని నోడల్ అధికారిగా నియమించడం జరిగింది. ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానిక ముందుగా చక్కటి ప్రణాళిక రూపొందించుకోవడానికి, తగినంత సిబ్బందిని సమకూర్చుకోవడానికి, రాష్ట్ర సరిహద్దులవద్ద పరిస్థితులను సమీక్షించుటకు వివిధ ప్రభుత్వ విభాగాలతో, కేంద్ర సంస్థలతో, సరిహద్దు రాష్ట్రాలలోని సరిహద్దుజిల్లాల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. తత్ఫలితంగా తీవ్రవాదుల కదలికలు, మత ఘర్షణల ప్రభావం, రాజకీయంగా సున్నితమైన నియోజక వర్గాల వంటి అంశాలను, పోలీస్ విభాగం అవసరాలను ఏ రోజుకారోజు సమీక్షించుకుంటూ తగిన ఏర్పాట్లు చేసుకోవడానికి పకడ్బందీ వ్యూహరచన చేయడం జరిగినది.
కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరపడానికి అవసరమయిన సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా మోహరించడం జరిగింది. రాష్ట్రంలో 414 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 404 ఎస్.ఎస్.టిలు, 3,385 సంచార బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి.
కీలకమైన పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలలో, అలాగే ప్రజల్లో భద్రత పట్ల భరోసా కల్పించే నిమిత్తం పొరుగు రాష్ట్రాలనుండి సిబ్బందిని, కేంద్ర దళాలను కూడా రంగంలో దింపడం జరిగింది. ప్రధానికి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి, ఇతర రాష్ట్ర ముఖ్య మంత్రులు మరియు కేంద్ర మంత్రులకు ఎస్.పి.జి, కేంద్ర దళాలు, ఎన్.ఎస్.జి దళాల రక్షణలో ఉన్న ప్రముఖులతోపాటూ, ప్రమాదం (ముప్పు) ఎదుర్కొంటున్న అభ్యర్థులకు, బహిరంగ సభల నిర్వహణ, రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణకు కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకించి ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వద్ద వామపక్ష తీవ్రవాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఏరివేత కార్యకలాపాలు, కవాతుల నిర్వహణ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది.
స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అంతరాయం కలిగించే అవకాశము ఉందన్న కారణంతో అనుమానితులందరినీ చట్ట ప్రకారం ముందుగా బైండ్-ఓవర్ చేయడం జరిగింది. ఎన్నడూ లేనంతగా 11,862 నాన్-బెయిలబుల్ వారంట్లు అమలు చేయడం జరిగింది, ప్రజల్లో విశ్వాసం కలిగించడానికి నాకాబందీ, చెక్‌పోస్ట్ లు, నిఘా పెంచడం వంటి చర్యలు తీసుకోవడం జరిగింది. పోలీస్ విభాగం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నదనడానికి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఇప్పటివరకు 1501 ఎఫ్.ఐ.ఆర్‌లు నమోదు కావడం.
కేంద్ర ఎన్నికల సంఘం సూచనలమేరకు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఉద్దేశించిన నగదు, మద్యం, బహుమతి వస్తువుల తరలింపుని నిశితంగా పరిశీలించడం జరిగింది. అత్యవసర పరిస్థితులలో కీలక ప్రదేశాలకు దళాలను మోహరించడానికి అంబులెన్స్, హెలికాప్టర్‌లను ఎన్నికల ప్రధాన అధికారి సిద్ధంగా ఉంచారు.
డిసెంబరు 6వ తేదీ వరకు రాష్ట్ర పోలీసు విభాగం రు.93,08,13,425/- నగదును స్వాధీనం చేసుకుంది. దీనిలో అక్టోబరు 19న ఆదిలాబాద్ పోలీసులు పట్టుకుని ఆదాయపు పన్ను విభాగానికి అప్పచెప్పిన రు.10 కోట్లు, నవంబరు 7న హైదరాబాద్ పోలీసులు పట్టుకుని న్యాయస్థానానికి అప్పచెప్పిన రు.7,51,10,300 లు కూడా ఉంది. రు.2,37,98,117 విలువ చేసే 53,769.33 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. (మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది నాలుగు లక్షల లీటర్లు). మొత్తం రు.6,78,86,373 ల విలువ చేసే 146.6 గ్రాముల ప్లాటినం, 689 గ్రాముల వజ్రాలు, 17.56 కిలోల బంగారం, 121.32 కిలోల వెండిని, రు.60,05,177ల విలువ చేసే 267.68 కిలోల గంజాయి తదితర మత్తు పదార్ధాలు, రు.1,68,89,075 ల విలువ చేసే బహుమతులను స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా 17,882 సెక్యూరిటీ కేసులను నమోదు చేయగా 90,238 మందిని బైండోవర్ చేయడం, 8482 లైసెన్సుడు ఆయుధాలను డిపాజిట్ చేసుకోవడం, 11 అక్రమ ఆయుధాల స్వాధీనం, 39 ఆయుధాల లైసెన్సులను రద్దు చేయడం, 1172 ఎన్నికల నియమావళి ఉల్లంఘనల కేసుల నమోదు, 11862 నాన్ బెయిలబుల్ వారంట్లను అమలు చేయడం జరిగింది.

డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ వారి కార్యాలయం,
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ.

About The Author