శబ్ద కాలుష్యం వల్ల గుండెపోటు…


పచ్చని చెట్లుగల ప్రశాంత వాతావరణంలో జీవించే వారికన్నా ఎప్పుడు రణగొణ ధ్వనులతో రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. రణగొణ ధ్వనుల మధ్య జీవించే వారికి రక్తపోటు వచ్చే అవకాశం కూడా ఎక్కువని బార్సిలోనాలోని ‘హాస్పిటల్‌ డెల్‌మార్‌ మెడికల్‌ రీసర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’కు చెందిన పరిశోధక బందం 2,761 మంది ప్రజల ఆరోగ్య పరిస్థితిని దాదాపు 9 ఏళ్ల పాటు అధ్యయనం చేయడం ద్వారా తేల్చింది. ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న వారికన్నా ఈ రణగొణ ధ్వనుల మధ్య జీవిస్తున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువని కనుగొన్నది.
కేవలం శబ్ద కాలుష్యం వల్లనే వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందా? సహజంగా పట్టణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీల నుంచి వాహనాల నుంచి వెలువడే కాలుష్య ప్రభావం తోడవడం వల్ల కూడా ప్రజలకు గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుందా ? అన్నది స్పష్టంగా ఈ అధ్యయనం తేల్చలేదు. పైగా పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వ్యాయామం అలవాటు కూడా తక్కువ, అందువల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. శబ్ద కాలుష్యం గురించి తప్పా మరో కాలుష్యం గురించి పేర్కొనక పోయినప్పటికీ ఈ అన్ని కాలుష్యాల వల్ల గుండెపోటు వచ్చే అవకాశం 30 శాతం పెరుగుతుందని మనం అర్థం చేసుకోవచ్చు.
బ్రిటన్‌లో ఏడాదికి దాదాపు లక్ష మంది గుండెపోటులకు గురవుతున్నారని, వారిలో ఎక్కువ మంది శబ్ద కాలుష్యం వల్లనే మరణిస్తున్నారని పరిశోధకులు తేల్చారు. గుండెపోటు వచ్చి ప్రస్తుతం ప్రాణాలతో ఉన్న వారు దాదాపు 12 లక్షల మంది ఉన్నారని, వారిలో కూడా ఎక్కువ మంది శబ్ద కాలుష్యం వల్ల గుండెపోటుకు గురయిన వారేనని తెలిపారు. గుండెపోటులో రెండు రకాలు ఉంటాయని, గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డడం వల్ల 80 శాతం గుండెపోట్లు వస్తాయని, రక్త నాళాలు చిట్లడం ద్వారా కూడా గుండెపోట్లు వస్తాయని, అలాంటి గుండెపోట్లు మొత్తంలో 20 శాతం ఉంటాయని పరిశోధకులు తెలిపారు.

About The Author