అంకురార్పణం..రాత్రి పూటే ఎందుకు? ఆ పేరు వెనుక ఆంతర్యం..?


బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు: అంకురార్పణం..రాత్రి పూటే ఎందుకు? ఆ పేరు వెనుక ఆంతర్యం..?
అంకురార్పణం.. ఆ పేరు వెనుక ఆంతర్యం..
ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 8 గంట‌ల మధ్యకాలంలో శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం చేయనున్నారు అర్చకులు. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చుకుడు వేణుగోపాల దీక్షితుల నేతృత్వంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం చేయనున్నారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం చాలా ప్రాముఖ్యత ఉంది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థిస్తూ అంకురార్పణం చేస్తుంటారు.

భూమాతకు తొలి పూజ..
అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. ఆగమ శాస్త్రాల ప్రకారం శ్రీవారి బ్రహ్మోత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించడం ఆనవాయితీ. పుట్ట‌మన్ను సేకరించి, అందులో న‌వ‌ ధాన్యాలను నాటుతారు. నవ ధాన్యాలకు మొలకలొచ్చే వరకు నీరు పోస్తారు. అంకురాలను మొలకెత్తించే కార్యక్రమం కావడం వల్లే ఈ క్రతువునకు అంకురార్పణం అని పేరు పెట్టారు. శాస్త్రాల ప్రకారం ఏదైనా ఉత్సవానికి 9, 7, 5, 3 రోజులు లేదా ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ.
అధి దేవత చంద్రుడు..
ఖగోళశాస్త్రంలోని సిద్ధాంతాల ప్రకారం రాత్రిపూటే అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు అర్చుకులు. మొక్కలకు అధి దేవత చంద్రుడు. చంద్రుడి సాక్షింగా రాత్రి సమయంలోనే విత్తనాలను నాటుతారు. ఆగమాల ప్రకారం విత్తనం బాగా మొలకెత్తడాన్ని ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. పాలికలు అనే పాత్రలను విత్తనాలను నాటేందుకు వినియోగిస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఈ మొక్కలను స్వామివారి పుష్కరిణీలో నిమజ్జనం చేస్తారు.

వడమాల పేట నుంచి దర్భలు..
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, హోమాల్లో వినియోగించే దర్భలను తిరుపతి సమీపంలోని వ‌డ‌మ‌ల‌పేట‌ వ్యవసాయ పొలాల గట్ల నుండి సేకరించారు. దీన్ని రెండురోజుల కిందటే తిరుమలకు తీసుకుని వచ్చారు. ఈ దర్భలతో 22 అడుగుల పొడవు, 6 అడుగుల వెడ‌ల్పు చాపను, 200 అడుగుల తాడును తయారుచేస్తారు. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు. దీనితో అంకురార్పణం, ధ్వజారోహణం క్రతువులు పూర్తవుతాయి

About The Author