బగ్దాదీ అండర్‌వేర్‌ను తమ గూఢచారి దొంగిలించి..!

ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ అమెరికా సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో చనిపోయారు.
చనిపోయింది బగ్దాదీయే అని డీఎన్ఏ పరీక్షల ద్వారా నిర్ధారించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అయితే, బగ్దాదీ డీఎన్‌ఏ శాంపిల్స్ అమెరికాకు ఎలా చేరాయి?

బగ్దాదీ అండర్‌వేర్‌ను తమ గూఢచారి దొంగిలించి తీసుకువచ్చారని, దాని ద్వారానే ఇప్పుడు మృతి చెందింది బగ్దాదీ అని తేల్చగలిగారని కుర్దుల నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఎసీడీఎఫ్) చెబుతోంది.
బగ్దాదీ ఉన్న చోటును గుర్తించడంలోనూ తమ గూఢచారి ముఖ్య పాత్ర పోషించినట్లు ఎస్‌డీఎఫ్ కమాండర్ పోలట్ క్యాన్ చెప్పారు.

అమెరికా ఆపరేషన్ సమయంలో బగ్దాదీ తనను తాను పేల్చివేసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో కుర్దు దళాల పాత్రను ట్రంప్ తక్కువ చేసి చూపారు.
బగ్దాదీ మరణం విషయం గురించి ప్రకటిస్తూ.. కుర్దులు ‘ఉపయోగకరమైన’ సమాచారం ఇచ్చారని, ‘సైనికపరంగా అసలు వారి పాత్రేమీ’ లేదని ట్రంప్ అన్నారు.
క్యాన్ మాత్రం ఎస్‌డీఎఫ్ ఈ ఆపరేషన్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిందని ట్విటర్‌ వేదికపై చెప్పారు.
అల్-బగ్దాదీ ఉన్న చోటును గుర్తించడం, ఆయన్ను చేరుకోవడం అంతా మా కృషే. బగ్దాదీ ఉన్న ప్రాంతం కోఆర్డినేట్స్‌ను మా గూఢచారే పంపారు.

హెలికాప్టర్ నుంచి దిగే దళాలకు సూచనలు ఇచ్చారు. చివరి నిమిషం దాకా ఆపరేషన్‌లో పాల్గొని విజయవంతం చేశారు” అని వివరించారు.
బగ్దాదీ జాడ గుర్తించేందుకు మే 15 నుంచి అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏతో కలిసి ఎస్‌డీఎఫ్ పనిచేస్తూ వచ్చిందని పోలట్ చెప్పారు.

ఇడ్లిబ్ ప్రావిన్సులో బగ్దాదీ దాక్కున్నట్లు తమ గూఢచారి గుర్తించారని, జారాబ్లస్‌ అనే కొత్త ప్రాంతానికి వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు కనిపెట్టి చెప్పారని పోలట్ వివరించారు.
ఇస్లామిక్ స్టేట్‌తో పోరాటంలో అమెరికాకు ఎస్‌డీఎఫ్ కీలక మిత్రపక్షంగా ఉంటూ వచ్చింది.

అయితే అక్టోబర్ మొదట్లో ఉత్తర సిరియా నుంచి ట్రంప్ తమ సేనలను ఉపసంహరించుకున్నారు.
సీమాంతర దాడులకు టర్కీకి వీలు కల్పించేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

About The Author