ఒకరి రక్తంతో నలుగురిని కాపాడొచ్చు

తిరుపతి:రక్తం లేని కారణంగా ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని రేణిగుంట డిఎస్పీ చంద్రశేఖర్, మల్లాడి పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్  పి.పి.ఎస్. కిషోర్ తెలిపారు. రేణిగుంట మండలం గాజులమండ్యం పారిశ్రామిక వాడ, మల్లాడి డ్రగ్స్ పరిశ్రమలో ఎస్పీ గజరావు భూపాల్ ఆదేశాల మేరకు డిఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రురల్ సిఐ అమర్నాథ్ రెడ్డి , ఎస్.ఐ. స్వాతి  లు మల్లాడి డ్రగ్స్ పరిశ్రమ వారి సహకారంతో రక్త దాన శిబిరాన్ని గురువారం ఉదయం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా డిఎస్పీ చంద్రశేఖర్, మల్లాడి పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ పి.పి.ఎస్. కిషోర్ లు మాట్లాడుతూ ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, పరిశ్రమ కార్మికులు, పోలీసులు, పాత్రికేయులు మొత్తం 120 మంది రక్త దానం చేశారని తెలిపారు. తిరుపతి చుట్టు ప్రక్క ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు, వివిధ ప్రమాదాలలో గాయపడిన వారికి ,  సరైన సమయంలో రక్తం దొరకడం లేదని తద్వారా కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం లేని కారణంగా ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదని ఆ లక్ష్యంతోనే ఈ రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేసామన్నారు. మల్లాడి పరిశ్రమ మేనేజర్ కె. దేవరాజ్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో డెంగ్యూ జ్వరాలు ఎక్కువ అయ్యాయని, రక్తహీనత సమస్య వలన ప్రసవ సమస్యలు కూడా ఉన్నాయని ఈ కారణంగా కూడా నిలువ చేసిన రక్తం ఖర్చు అవుతోందన్నారు. ఇదే క్రమంలో రక్తంను సరిపడా నిలువ చేసుకోవాలని, అందుకు అందరు సహకారం అందించాలని, ఆరోగ్యంగా ఉన్నవారు రక్త దానం చేయాలని తెలిపారు. రురల్ సిఐ అమర్నాథ్ రెడ్డి , ఎస్.ఐ. స్వాతిలు మాట్లాడుతూ రక్త దానం చేయడం వలన తోటి వారి ప్రాణాలు కాపాడతామే కాకుండా తద్వార రక్త ఇచ్చిన వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులమండ్యం పోలీసులు, పరిశ్రమ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

About The Author