13.12.2018 రేపు మార్గశిర శుద్ధ షష్ఠి…

13.12.2018 రేపు మార్గశిర శుద్ధ షష్ఠి.

అనగా సుబ్రహ్మణ్యుని యొక్క దివ్యమైన ఆరాధనకు అనువైన శుభతిథి. ఏ మాసమందైనా ఉభయపక్షాలలోనూ షష్ఠి ప్రధానంగా చెప్పబడుతున్నది. విష్ణువునకు ఏకాదశి, గణపతికి చతుర్థి, శివునికి మాసశివరాత్రి ఏవిధంగా ఉన్నాయో సుబ్రహ్మణ్యునికి షష్ఠీ తిథి అంత ముఖ్యమైనది. ఈరోజున సుబ్రహ్మణ్యారాధన విశేషం. అందునా ప్రత్యేకించి మార్గశీర్ష మాసంలో చేసినట్లయితే సంవత్సరకాల షష్టుల ఆరాధనా ఫలితం లభిస్తున్నది. సుబ్రహ్మణ్యుని తత్వము చాలా దివ్యమైనటువంటిది. వేదం మనకు అందించినటువంటి ఆరు మతాలలో ఒకటి సుబ్రహ్మణ్య మతం – దీనికి స్కాందం అని కూడా పేరు.
సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా శక్తి, జ్ఞానము ఈ రెండింటికీ సంబంధించినటువంటి వాడు. మూడవది యాగతత్త్వము. అనగా శక్తి జ్ఞాన యజ్ఞ తత్త్వములయందు సుబ్రహ్మణ్యుని యొక్క వైభవం మనకు కనపడుతూ ఉన్నది. సుబ్రహ్మణ్యుడు శక్తి ప్రధానమైన దేవత. ఏ శక్తి అంటే శివశక్తి. శివశక్తి అంటే ఈ విశ్వాన్నంతటినీ నడిపే పరమేశ్వరుని శక్తి. పరమేశ్వరుడు, పరమేశ్వరుని శక్తి – ఈ రెండింటి ఐక్య రూపమే సుబ్రహ్మణ్యుడు. మనకు కనపడుతున్నది ఈ విశ్వం. కనపడట్లేదు పరమేశ్వరుడు. కానీ విశ్వరూపముగా కనపడుతున్నది పరమేశ్వరుడే అనే ఎరుక మనకు కలగాలి. కనుక పరమేశ్వరుడు కనపడట్లేదు అని చెప్పలేం మనం. కనపడుతున్న విశ్వమే విశ్వేశ్వరుడు. అయితే విశ్వము విశ్వేశ్వరుడు అన్న ఎరుక మనకు కలగడం కోసం విశ్వమంతా ఏదైతే వ్యాపించి ఉందో అనంత శక్తి ఆ విశ్వేశ్వరునిదే అనే ఎరుక మనకు కలగాలి. ఆ భావన మనలో స్థిరపడితే అణువణువునా పరమాత్మను మనం దర్శించగలం. అందుకు మన చుట్టూ వున్న విశ్వమంతా విశ్వేశ్వరమయంగా దర్శించడం కోసం ఈ విశ్వం ఎంత మనం చెప్పుకున్నా ప్రధానంగా నాలుగు దిక్కులలో కనపడుతున్నది. మిగిలిన రెండూ అంటే పైన, క్రింద. నాలుగు దిక్కులు, ఊర్ధ్వ, అధః – ఈ మొత్తం కలిపితే ఆరు అయ్యాయి. ఈ ఆరు దిక్కులయందు వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వర చైతన్యమే శివశక్తి స్వరూపం. ఈ శివశక్తుల యొక్క ఏకస్వరూపం ఆరుదిశలలో వ్యాపించి ఉంది గనుక ఆరు దిక్కులలో వ్యాపించినటువంటి శివశక్తి స్వరూపమే ఆరుముఖాల సుబ్రహ్మణ్యుడు . ఈ భావనతో సుబ్రహ్మణ్యారాధన చేయాలి.

About The Author