రైతు కోసం ఓ బాల శాస్త్రవేత్త…
చిన్న వయసులోనే రైతులకు ఉపయోగపడే పరికరాలను తయారుచేశాడు. పొలంలో తల్లితండ్రులతో పాటు రైతు కూలీలు పడుతున్న అవస్థలను గమనించి వరిలో కలుపుతీత పరికరం కనిపెట్టాడు. ఆ పరికరం బాల శాస్త్రవేత్త గొర్రె అశోక్‌కు ఇటీవల కోల్‌కతాలో జరిగిన సైన్స్ ఫెస్టివల్లో ప్రథమ బహుమతిని తెచ్చి పెట్టింది!
నల్లగొండ జిల్లా దేవరకొండ ఒకేషనల్ కళాశాలలో అశోక్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం(వ్యవసాయ విభాగం) చదువుతున్నాడు. అశోక్‌ది వ్యవసాయ కుటుంబం. సెలవు రోజుల్లో సొంతూరు అంజలిపురానికి (సూర్యాపేట జిల్లా) వెళ్లి తండ్రి నాగరాజుకు పొలం పనుల్లో సాయం చేసేవాడు. ఆ సమయంలో వరిలో కలుపు తీయడానికి తల్లితండ్రులు, కూలీలు పడుతున్న ఇబ్బందులు గమనించాడు.
* వరిలో కలుపు – రైతుల శ్రమకు… చెక్!
కలుపు తీయడానికి రోజంతా ఎండలో నడుము వంచి పనిచేసే రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సులువుగా కలుపు తీసే పరికరాన్ని రూపొందించాలని అశోక్ అనుకున్నాడు. సైకిల్ బ్రేకు, ఇనుప రాడ్డు, ఇనుప కట్టర్‌ను ఈ పరికరం తయారీలో వాడారు. వరిపొలాల్లో నిలబడి ఒంటి చేత్తోనే కలుపు తీసేలా పరికరాన్ని తయారుచేశాడు. రెండు బ్లేడ్ల మధ్యలో కలుపు మొక్కను ఉంచి తెగిపోకుండా తుదకంటా పీకవచ్చు. మెట్ట పైర్లలా వరిలో సాళ్లు సాఫీగా ఉండవు కాబట్టి అరక, ట్రాక్టర్ ఉపయోగించి కలుపు తీయడం సాధ్యం కాదు. ఈ పరికరంతో అయితే ఎలాంటి వరిపొలంలో అయినా సులభంగా కలుపు తీయవచ్చు. ముదురు కలుపును ఏరిపారేయవచ్చు. వరి మాగాణుల్లో కలుపు తీయాలంటే రోజంతా కష్టపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల రైతుకు శ్రమ తగ్గుతుంది. సమయం ఆదా అవుతుంది. చేతులు బొబ్బలెక్కి గాయపడడం ఉండదు. ఇలా రైతులు సమస్యలన్నింటికీ అశోక్ పరికరం చెక్‌పెట్టింది. ఈ పరికరం తయారీకి 600 రూపాయలు మాత్రమే ఖర్చయింది. అందువల్ల ఇది చిన్న రైతులకు కూడా అందుబాటు ధరలో లభిస్తుంది.
* సైన్స్ ఫెస్టివల్లో మొదటి బహుమతి
తన ఆవిష్కరణల వివరాలతో అశోక్ విజ్ఞానభారతి- కేంద్ర శాస్త్ర, సాంకేతిక భూ, విజ్ఞాన శాఖకు దరఖాస్తు చేసుకున్నాడు. తన ఆవిష్కరణతో సైన్స్ ఫెస్టివల్లో పాల్గొనమని అక్కడ నుంచి పిలుపు వ చ్చింది. నవంబర్ 5, 6, 7 తేదీల్లో కోల్‌కతాలో ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ – 2019’ జరిగింది. అందులో అశోక్ తయారుచేసిన వరిలో కలుపుతీసే పరికరానికి వ్యవసాయ విభాగంలో ప్రథమ బహుమతి లభించింది. ఈ ప్రదర్శనలో 150 మందికిపైగా తమ ఆవిష్కరణలను ప్రదర్శించారు. దేశంలోని అన్ని రాష్ర్టాల నుంచి ఇంజనీర్లు ఈ సైన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. వారందరిలోకి చిన్నవాడయిన అశోక్ ఆవిష్కరణకు మొదటి బహుమతి దక్కడం విశేషం. వరిలో కలుపుతీసే పరికరం తయారీతో అశోక్‌కు దేశస్థాయిలో గుర్తింపు లభించింది. దాంతోపాటు త్వరలో న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగే ఆవిష్కరణ ఉత్సవాల్లో పాల్గొనే అవకాశమూ దక్కించుకున్నాడీ ఆవిష్కర్త.
* అచ్చు పరికరం…
అశోక్ గతంలో కూడా కొన్ని వ్యవసాయ పరికరాలను తయారుచేశాడు. పత్తి, మిరపతోటల్లో విత్తనాలు వేసుకోవడానికి తయారుచేసిన అచ్చు పరికరం వాటిలో ఒకటి. అచ్చుతో పాటు ఆ పరికరంతో ఆరబోసిన ధాన్యాన్ని కుప్ప చేయవచ్చు. కల్లంలో గడి ్డని పోగుచేయవచ్చు. ఈ పరికరం ఖరీదు 2 వేలు. ఇప్పటికే ఈ పరికరాన్ని తన సొంత గ్రామంలోని 20 మంది రైతులకు తయారుచేసి ఇచ్చాడు. బధిరులకు ఉపయోగపడే అలారాన్ని కూడా అశోక్ గతంలో తయారు చేశాడు.
* 300 పరిక రాలకు ఆర్డర్లు
‘‘మనదేశంలో చిన్న రైతుల సంఖ్య చాలా ఎక్కువ. వ్యవసాయంలో వాడే యంత్ర పరికరాల కోసం వాళ్లు పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టలేరు. అందుకే తక్కువ ఖర్చుతో వరిలో కలుపు తీసే పరికరాన్ని రూపొందించాను. ఇప్పటికే 300 ఆర్డర్లు వచ్చాయి. ఈ పరికరాలు కావలసిన రైతులు (ఫోన్ నంబర్ 86885 33637) నన్ను సంప్రతించవచ్చు.’’