శివుని ఆభరణాలు, ఆయుధాలకి సంబం ధించి ఏదైనా అంతరార్థం ఉందా?

శివుని ఆభరణాలు, ఆయుధాలకి సంబం ధించి ఏదైనా అంతరార్థం ఉందా?


దానికి ధర్మగుప్తులు వారు ఈ వివరణ ఇచ్చారు: “గణపతికి పాశాంకుశాలు,
విష్ణువుకి సుదర్శన చక్రం
ఎలాంటి ముఖ్య ఆయుధాలో..
శివునికి త్రిశూలం అలాంటి ముఖ్య ఆయుధం.

త్రిశూలానికి మూడు కొనలుండి అడుగున వాటిని కలుపుతూ శూలహస్తం ఉంటుంది.
మూడు కొనలు సత్వ, రజస్, తమో గుణాలను సూచిస్తే ఆ శూలహస్తం వాటి ఏకత్వాన్ని.సూచిస్తుంది.
ఇక్కడ త్రిగుణాల ఏకత్వం అంటే వాటికి అతీతమైన తత్త్వం అని అర్థం.
అంతేకాకుండా ఇడ, పింగళ, సుషుమ్ననాడులు మూడూ శిరస్సులోని జ్ఞాన కేంద్రం దగ్గర కలుస్తాయి.
దీన్నే త్రివేణి సంగమం అంటారు.
ఆ మూడు నాడులు మూడు కొనలని సూచిస్తే
జ్ఞానకేంద్రం శూలహస్తాన్ని..
వాటి ఏకత్వం త్రిగుణ సంగమాన్ని
సూచిస్తుంది.

ఆకాశం శబ్ద గుణంతో కూడుకొని ఉంది.
ఆకాశంలో ధ్వనుల ప్రకంపనలు ప్రయాణం చేస్తుంటాయి. మనం పవిత్ర మైన మంత్రాలను శ్రద్ధాసక్తులతో చదివేటప్పుడు కాని, వినేటప్పుడు కాని
వాటినుండి మధురమైన ఢమరుక నాదం వినిపిస్తుంది. యోగులకు ఇది మహదానందాన్ని కలిగిస్తుంది.
దీన్ని సూచిస్తూ శివుని త్రిశూలానికి ఢమరుకం కట్టి ఉంటుంది.

సర్పిలాకారంలో ఉండే కుండలినీశక్తిని సూచిస్తూ శివుడు సర్పాలను మెడలో ధరిస్తారు.
అందుకే నాగాభరణుడు అనే పేరు ఉంది.
ఈ కుండలినీ శక్తి విజృభించినపుడు అష్ట సిద్ధులు కలుగుతాయి.
ఈ అష్టసిద్ధులు శివుని నియంత్రణలో ఉండటం వల్ల, వారు అష్టసిద్ధులకు ప్రభువు అవడం వల్ల
ఆయన్ని ఈశ్వరుడు అని పిలుస్తారు.
ఈశ్వరుడు అనే పదానికి ప్రభువు అని అర్థం.
జ్ఞానికి యోగదృష్టి కలగడానికి, భూత, భవిష్యత్, వర్తమానాలు గ్రహించడానికి ఆజ్ఞాచక్రం వికసించాలి,
అది వికసించిన దన్న సంకేతమే శివుని మూడోకన్ను.

తాంత్రిక సిద్ధులు పులిలా భయంకరమైనవి.
వాటిని పూర్తిగా లొంగదీసి తమ అధీనంలో పెట్టుకున్నానని తెలుపుతూ శివుడు వ్యాఘ్రచర్మం ధరిస్తారు.
నిర్మలమైన బ్రహ్మ జ్ఞానానికి, అమృతత్త్వ సిద్ధికి పరమ పావని గంగ సంకేత మయితే నిత్య ప్రసన్నత్వంవల్ల కలిగే ప్రశాంత ఆనందాన్ని నెలవంక సూచిస్తుంది.

స్త్రీ పురుషులు ఇద్దరిలోను స్త్రీ, పురుష తత్త్వాలు రెండూ కలిసే ఉంటాయి.
శరీరం కుడిభాగంలో ఉండే శక్తి పురుష శక్తి, ఎడమభాగంలో ఉండే శక్తి స్త్రీశక్తి.
ఈ శక్తుల అవిచ్ఛిన్న సంయోగమే అర్థనారీశ్వరత్వం. ఇంతేకాక కాలచక్రం కూడా అర్థనారీశ్వర తత్త్వమని, ఎన్నడూ విడదీయరాని జంట అని తెలుసుకోగలగాలి. రాత్రి-పగలు, పౌర్ణమి-అమావాస్యల వంటివి అన్నీ ఒక దానిమీద ఒకటి ఆధార పడి ఉంటాయి.
ఒకటి లేనిదే మరొకటి లేదు.

శివుడు సంహారకారకుడు అంటే పాతసృష్టిని తీసి
కొత్త సృష్టిని కల్పించేవాడని అర్థం.
ధనుస్సు ధరించి ఆర్ద్రా నక్షత్రంలో గోచరమయ్యే రుద్రుడు పరుగులు తీస్తూ పారిపోతున్న జింకను వెన్నంటి వేటాడే వేటగానిలా కనిపిస్తారు.
ఇది ఆకాశంలో మిథున కర్కాటక రాసులకు అడ్డంగా ఐమూలగా ఉంటుంది.
ఈ నక్షత్ర మండలానికి దగ్గరగా క్రూరగ్రహాలైన శని, కుజ, రాహు, కేతువులు సంచారం చేసినట్లయితే
ప్రపంచ యుద్ధాలు, ప్రళయాలు జరుగుతాయి.

యోగాగ్ని వల్ల అన్ని కోరికలు భస్మమైనట్లయితే
ఏ కోరికలూ లేని వైరాగ్యస్థితి కలిగి, ఆ వైరాగ్య స్థితిలో చక్కటి ప్రశాంతతతో కూడిన నిర్వాణస్థితి అనుభవంలోకి వస్తుంది.
దీన్ని సూచిస్తూ శివున్ని స్మశానవాసి అంటారు.
విభూతి పవిత్రమైన తెల్లటి జ్ఞానానికి గుర్తు.
అధిభౌతిక, అధిదైవిక, ఆధ్యాత్మిక, ఈ మూడు స్థాయిలలోను జ్ఞానప్రాప్తి లభిస్తుంది.
పైన చెప్పిన బాధలను శరీరం అనుభవిస్తూ ఉన్నా నిజమైన సాధకుడు ఆత్మను పరిశుద్ధంగా ఉంచుతూ దైవ సాన్నిధ్యాన్ని పొందవచ్చును అనే విషయాన్ని సూచిస్తూ శివభక్తులు మూడు విభూతి రేఖలను (త్రిపుండ్రాలు) ధరిస్తారు.

శివార్చనా విధానాలు.?
మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు.
మహాశివరాత్రి మంగళవారం నాడు అలాగే
త్రయోదశి శనివారం నాడు వస్తే చాలా మంచిది. కర్మకారకుడైన శని వల్ల కలిగే కష్టాలను శనికి అధిదేవత అయిన శివుని పూజచేసి పోగొట్టుకోవచ్చు.
శని త్రయోదశి నాడు ప్రదోష (సాయంసంధ్యా) సమయంలో శివార్చన చేస్తే కర్మదోషాలు పోయి సుఖశాంతులు కల్గుతాయి.

శివుడు పంచభూతాత్మకుడు.
మన శరీరంలోని..మూలాధారంలో ఉన్న పృథ్వీతత్త్వానికి ప్రతీకగా పార్థివ లింగాన్ని;
స్వాధిష్ఠానంలో ఉన్న జలతత్త్వానికి ప్రతీకగా జలలింగాన్ని; మణిపూరకంలో ఉన్న అగ్నితత్త్వానికి ప్రతీకగా జ్వాలాలింగాన్ని;
విశుద్ధిలోని వాయుతత్త్వానికి ప్రతీకగా వాయులింగాన్ని అనాహతంలోని ఆకాశతత్త్వానికి ప్రతీకగా చిదంబరలింగాన్ని సాధకులు పూజిస్తారు.
ఆకాశ లింగంగా పిలవబడే చిదంబరలింగానికి అసలు రూపమే ఉండదు.
రుణము అంటే పాపం.
పాపం లేనిది అరుణం.
పాపాలను నాశనం చేసేవాడు, అరుణాచలేశ్వరుడు.

శ్రీపాదులే శ్రీవేంకటేశ్వరులు.?
ఇంతవరకు ఆపాదమస్తకం పరమశివుని తత్వాన్ని విశ్లే షించిన ధర్మగుప్తులు, ఈ ప్రసంగాన్ని ముగిస్తూ శ్రీపాదులు పద్మావతీ సమేత వేంకటేశ్వరుల సంయుక్త రూపమని వర్ణిస్తూ దానిని ఇలా వివరించారు:
శ్రీవేంకటేశ్వరులు కృత యుగం నుంచే ఉన్నారు. దశరథునికి పుత్రునిలా జన్మిస్తానని వరం ఇచ్చి, శ్రీరామునిలా అవతరించారు.
అందువల్ల కౌసల్యా తనయుడు అయిన శ్రీరామునిగా పూజింపవచ్చు.
కొంతకాలంపాటు వారిని శక్తి స్వరూపమైన
బాలాత్రిపుర సుందరిగా, కొంతకాలం శివస్వరూపంగా, కొంతకాలం సుబ్రహ్మణ్యస్వామిగా,
కొంతకాలం మహావిష్ణువుగా ఆరాధించారు.

వారి వైష్ణవమాయకు అంతు ఎక్కడ?
జగన్మోహినీ రూపం లో దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచి,
మన్మథుడి అవసరమే లేకుండా శివుని మోహింపజేసి, ధర్మశాస్తను (అయ్యప్పను) జన్మింపజేసి
సృష్టికే ఒక క్రొత్త అర్థాన్ని ఇచ్చిన ప్రభువునకు అసాధ్యం అనేది ఏమైనా ఉంటుందా..!!
ఓం నమః శివాయ..!!?

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

About The Author