స్మార్ట్‌ఫోన్లు వద్దు.. కోడి పిల్లలు ముద్దు..!
ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఎక్కువైపోయింది. చేతిలో క్షణం పాటు సెల్‌ఫోన్ లేకపోతే ప్రపంచంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్‌లో బతుకుతున్నారు ప్రతి ఒక్కరూ. విద్యార్థులు అయితే స్మార్ట్‌ఫోన్లకు బానిసలవుతున్నారు. సెల్‌ఫోన్ మోజులో పడి పుస్తకాలకు దూరమవుతున్నారు. స్కూల్, కాలేజీకి వెళ్లినా కూడా ఓ పుస్తకం మాదిరి సెల్‌ఫోన్ చేతిలో ఉండాల్సిందే. పుస్తకాల కంటే సెల్‌ఫోన్లకే అధిక ప్రాధాన్యత ఇస్తున్న విద్యార్థులు.. చదువును మరిచిపోతున్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాంకేతికతను మంచి పనులకు వాడుకుంటే పర్లేదు.. కానీ చెడు పనులకు వినియోగిస్తేనే అసలైన సమస్య. స్మార్ట్‌ఫోన్స్, గాడ్జెట్స్‌కు పూర్తిగా దూరం ఉంచాలనే ఉద్దేశంతో వాటి నుంచి పిల్లల దృష్టిని మరల్చేందుకు ఇండోనేషియాలోని బందూంగ్ పట్టణంలోని విద్యాశాఖ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బందూంగ్ పట్టణంలోని మాధ్యమిక, ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులచే కోడి పిల్లలను పెంచే కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. పాఠశాల సమయం ముగిసిన తర్వాత కోళ్ల సంరక్షణ చూసుకోవడంలో బిజీ అయిపోతే స్మార్ట్‌ఫోన్లపై దృష్టి ఉండదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కోడి పిల్లలకు అవసరమైన ఆహారాన్ని పెట్టడం.. వాటి సంరక్షణ చూసుకోవడం విద్యార్థుల బాధ్యత.
ఈ కోడి పిల్లలను పాఠశాల ఆవరణలో కానీ, తమ నివాసాల వద్ద కానీ పెంచుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా గురువారం కొన్ని కోడి పిల్లలు ఉన్న బోన్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఆ బోన్లపై దయచేసి నన్ను జాగ్రత్తగా చూసుకో అని రాసి ఉంది. త్వరలోనే నాలుగు రోజుల వయసున్న 2 వేల కోడి పిల్లలను విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా బందూంగ్ మేయర్ మహ్మద్ డానియల్ మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ల బారి నుంచి విద్యార్థులను అరికట్టడానికే ఈ చర్య కాదు.. జాతీయ విద్యా ప్రణాళికలో ఈ కార్యక్రమం ఒక భాగమని ఆయన స్పష్టం చేశారు. ఇక కోడి పిల్లల పంపిణీ కోసం స్థానిక కోళ్ల ఫారంల వద్ద అధికారులు ఒప్పందం చేసుకున్నారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల ఫారం రైతులుగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం విద్యార్థులకు ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు అంటున్నారు.