మొబైల్ పాతిపెట్టిన నిందితులు .దొరికిన దిశ మొబైల్ . కీలక విషయాల వెల్లడి
డాక్టర్ దిశ అత్యంత పాశవికంగా అత్యాచారానికి గురై,హత్య భావించబడిన సంఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు . ఇక ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసుల కస్టడీలోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు. మరింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సెల్ ఫోన్ పాతిపెట్టినట్టు చెప్పిన నిందితులు
సభ్య సమాజం షాక్ గురయ్యేలా వెటర్నరీ డాక్టర్ దిశ దారుణ అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనలో ఒక్కో నిజం ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది . ఇప్పటికే ఆమెను బతికుండగానే తగులబెట్టినట్టు , దిశను సజీవ దహనం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా మరో నిజం కూడా వెలుగు చూసింది. ఇక దిశ సెల్ ఫోన్ ఏం చేశారో ఎక్కడ ఉందో పోలీసులు తాజా విచారణలో కనుగొన్నారు . తొలుత దిశ సెల్‌ఫోన్‌ను నిందితులు మంటల్లో వేసి ఉంటారని పోలీసులు భావించారు. అయితే దానిని పాతిపెట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది.
సెల్ ఫోన్ ను గుర్తించి కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్న పోలీసులు
ఘటనాస్థలంలో బ్రిడ్జి క్రింద మట్టిని తవ్వి సెల్ ఫోన్ పూడ్చిపెట్టారు నిందితులు . మరోసారి క్లూస్‌టీమ్ తనిఖీలు నిర్వహించి సెల్ ఫోన్ ను సేకరించింది . ఇప్పటికే పోలీసులు ఆ సెల్‌ఫోన్ ఆధారంగా కాల్ లిస్ట్, కాల్ రికార్డ్‌ను పరిశీలిస్తున్నారు. ఇక దీని ద్వారా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఇక అంతే కాదు దిశ కేసుకు సంబంధించి కీలకమైన భౌతిక సాక్ష్యాలను కూడా ఇప్పటికే పోలీసులు కోర్టు ముందు ఉంచినట్లు సమాచారం. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న వస్తువులను కోర్టుకు సీల్డు కవరులో అందజేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే దిశకు సంబంధించిన వస్తువుల స్వాధీనం
టోల్ గేట్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో సంఘటన జరిగిన చోట దిశకు సంబంధించిన పర్సు, డెబిట్ కార్డు, చున్నీ, లాకెట్, ఐడీ కార్డు, లోదుస్తులు, జీన్ ఫ్యాంట్, చెప్పులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన మరుసటి రోజే సంఘటనా స్థలంలో ఉన్న కీలక ఆధారాలను పోలీసులు గుర్తించారు. ఇక త్వరితగతిన వారం రోజుల కస్టడీలో నిందితులను విచారించి వారి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసి చార్జ్ షీట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో దాఖలు చెయ్యనున్నారు .