హరిత ఉద్యమమైన గ్రీన్ ఛాలెంజ్ లో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


హరిత ఉద్యమమైన గ్రీన్ ఛాలెంజ్ లో ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారి, ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (PCCF) ఆర్.శోభ లు గ్రీన్ ఛాలెంజ్ నిర్వహించారు. శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో జంగిల్ క్యాంపు అర్బన్ ఫారెస్ట్ అడ్వంచర్ క్యాంపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఈ అధికారులు ఆ తర్వాత అటవీ ప్రాంతంలో మొక్కలు నాటారు.
చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి ఇటీవల విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను అంగీకరించిన రాజేశ్వర్ తివారి మూడు మొక్కలు నాటి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లను నామినేట్ చేశారు. ఇదే కార్యక్రమంలో ఉన్నఅజయ్ మిశ్రా వెంటనే మొక్కలు నాటి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం ఎంపీసీ రఘుమారెడ్డి, హర్షగూడ సర్పంచ్ పాండు నాయక్ లను నామినేట్ చేశారు.
ఇక చీఫ్ సెక్రటరీ జోషితో పాటు, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ (TUFIDC) చైర్మన్ కే. విప్లవ్ కుమార్ ఇచ్చిన రెండు గ్రీన్ ఛాలెంజ్ లను స్వీకరించిన పీసీసీఎఫ్ ఆర్.శోభ మొత్తం ఆరు మొక్కలు నాటి మరో ఆరుగురిని నామినేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీఎఫ్ ఎన్.ప్రతీప్ కుమార్, తెలంగాణ అదనపు పీసీసీఎఫ్ లు ఆర్.ఎం.డోబ్రియల్, పర్గెయిన్, లోకేష్ జైస్వాల్, స్వర్గం శ్రీనివాస్, సీసీఎఫ్ సునితా భగవత్ లను మొక్కలు నాటాల్సిందిగా గ్రీన్ ఛాలెంజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అటవీశాఖ అధికారులు.
ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటోందని అన్నారు. పర్యావరణ సృహ పెంచటంతో పాటు, అందరూ మొక్కలు నాటాలి, వాటిని సంరక్షించాలన్న పట్టుదలను గ్రీన్ చాలెంజ్ పెంచుతోందని ప్రశంసించారు.

About The Author