మధ్యాహ్నం తర్వాతే శ్రీవారి దర్శనం…


సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ తలుపులను తితిదే బుధవారం రాత్రి 11 గంటలకు శాస్త్రోక్తంగా మూసివేసింది. అప్పటిలోగా దర్శనం చేయించడానికి వీలుగా భక్తులను పరిమితంగా సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే క్యూలైన్లలోకి అనుమతించింది. గురువారం ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉన్నందున.. మధ్యాహ్నం 12 గంటలకు ఆలయ తలుపులు తెరచి శుద్ధి చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. గురువారం వీఐపీ బ్రేక్‌ దర్శనాలతో పాటు తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం సేవలను తితిదే రద్దుచేసింది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం సముదాయంలో మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొంది.

* జనవరి 1, 6, 7 తేదీల్లో కాటేజీ దాతలకూ గదుల్లేవ్‌..!

ఆంగ్ల నూతన సంవత్సరాది 2020 జనవరి 1న, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా 6, 7తేదీల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యమిస్తూ కాటేజీ దాతలు, దాతల సిఫార్సు లేఖలను తీసుకువచ్చే భక్తులకు గదుల కేటాయింపును నిలిపివేస్తున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. డిసెంబర్‌ 30, జనవరి 1, జనవరి 4 నుంచి 7వ తేదీల వరకు దాతలకు సైతం గదుల కేటాయింపు ఉండదని స్పష్టం చేసింది.

About The Author