భారత్‌పై పాకిస్తాన్ మిడతల దాడి…
భారత్‌పై పాకిస్తాన్ మిడతల దాడి పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద తండాలే కాక మిడతల దండు కూడా భారత్‌లోకి చొరబడుతున్నాయి. గుజరాత్‌లో పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. సమస్య తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 11 బృందాలను గుజరాత్‌కు పంపింది. కొద్దిరోజులుగా ఈ మిడతలు సమూహాలుగా వచ్చి బనాస్‌కాంఠా, మెహసాణా, కచ్, పాఠన్, సాబర్‌కాంఠా జిల్లాల్లో ఆవాలు, జీలకర్ర, ఆముదం, బంగాళ దుంప, గోధుమ, పత్తి, జట్రోఫా వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. ఒక్క బనాస్‌కాంఠా జిల్లాలోనే 5వేల హెక్టార్లలో పంటకు నష్టం కలిగింది. ఈ బెడదను ఎదుర్కోవడానికి కేంద్ర బృందాలు క్రిమిసంహారక మందులు చల్లించడం సహా అన్ని చర్యలనూ చేపడతాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. డ్రోన్ల సాయంతో క్రిమిసంహారక మందులను చల్లడం సహా అనేక మార్గాలను అధికారులు పరిశీలిస్తున్నారు. పొలాల్లో టైర్లను మండించడం; డప్పు, ప్లేట్లను మోగించడం, పొలాల వద్ద టేబుల్ ఫ్యాన్‌లు పెట్టడం, లౌడ్ స్పీకర్లతో సంగీతాన్ని వినిపించడం ద్వారా ఆ కీటకాలను చెదరగొట్టాలని రైతులకు ఇప్పటికే సూచించారు. అయితే వీటితో పెద్దగా ఫలితం ఉండటంలేదు. బనాస్‌కాంఠా జిల్లాలో 1815 హెక్టార్లలో క్రిమిసంహారక మందులను చల్లించామని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పేర్కొన్నారు. మిడతల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ 25 శాతం మిడతలను నిర్మూలించామని, మరో 4 రోజుల్లో పూర్తిగా వాటి బెడదను తొలగిస్తామని అధికారులు తెలిపారు.