అమ్మ కోసం కొడుకు.. అతడి వెంటే భార్య …
అమ్మ కోసం కొడుకు..
అతడి వెంటే భార్య .. ఇదో విషాదం ..
తల్లి మృతిని తట్టుకోలేక కుమారుడు, భర్తని విడిచి ఉండలేక గర్భిణి అయిన భార్య ప్రాణాలు తీసుకున్న విషాద ఘటన తమిళనాడులో జరిగింది. చెన్నై మడిపాక్కంకు చెందిన గురురాజన్, లలిత దంపతులకు మణిబాలన్ (35), సారథి (32) అనే ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్ల క్రితం గురురాజన్, గత ఏడాది నవంబరులో లలిత మరణించారు. తల్లి చనిపోయిన నాటి నుంచి సారథి దిగాలు పడిపోయాడు. అతని మానసిక స్థితి కుదుటపడాలన్న ఉద్దేశంతో పెద్దలు ఐదునెలల క్రితం తల్లిదండ్రులు లేని అనాథైన ప్రశాంతి (20) అనే యువతితో వివాహం జరిపించారు. ఈనెల 12న సాయంత్రం వరకు ఇంటి తలుపులు తెరుచుకోకపోవడంతో సారథి అన్న మణిబాలన్కు సమాచారం ఇచ్చారు.
అన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా దంపతులిద్దరూ తీయలేదు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా బెడ్రూములోని సీలింగ్ ఫ్యాన్‌కు దంపతులిద్దరూ వేర్వేరుగా ఉరివేసుకుని వేళాడుతున్నారు. మృతదేహాలున్న గదిలో దొరికిన ఉత్తరంలో దంపతులిద్దరూ ఆత్మహత్యకు గల కారణాలను ఎవరికి వారుగా రాసుకున్నారు. ‘అమ్మ మృతిని తట్టుకోలేకపోతున్నాను. అమ్మలేని ప్రపంచంలో నేను ఉండలేను. నాతోపాటూ భార్య ప్రశాంతి కూడా తనువు చాలించుకుంటోంది. మా ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదు. మా అంత్యక్రియల ఖర్చుకు అవసరమైన డబ్బు నా బ్యాంకు అకౌంట్లో ఉంది’ అని సారథి రాసుకున్నారు. భార్య ప్రశాంతి తన ఉత్తరంలో ‘నేను తల్లిదండ్రులు లేని అనాథను, నాకున్న ఒకేఒక బంధువు భర్త మాత్రమే. అతనికి జీవించడం ఇష్టం లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.’ అని రాసింది. పోస్ట్‌మార్టంలో ప్రశాంతి 4 నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు.