కుక్కే శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రం ( కర్ణాటక )

కుక్కే శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రం ( కర్ణాటక )

కుక్కే శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రం . ఆ ఊరు పేరే సుబ్రహ్మణ్య. ఈ క్షేత్రం బెంగళూరుకి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో, దక్షిణకన్నడ జిల్లాలో ఉంది. తమిళనాడులో ఆరు సుబ్రహ్మహ్మణ్య క్షేత్రాలను కలిపి ఆరుపడైవీడు అని వ్యవహరిస్తారు, ఆ ఆరు క్షేత్రాలను స్వామి వారి ఆరు ముఖాలుగా చెప్తారు. అలాగే కర్ణాటకలో మూడు ప్రసిద్ధ సుబ్రహ్మణ క్షేత్రాలను విశేషంగా కొలుస్తారు.

మొదటిది ఆది సుబ్రహ్మణ్య – కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య
రెండవది మధ్య సుబ్రహ్మణ్య – ఘాటి సుబ్రహ్మణ్య (బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది).
మూడవది అంత్య సుబ్రహ్మణ్య – నాగలమడక సుబ్రహ్మణ్య (ఇది అనంతపురం నుంచి డబ్భై కిలోమేటర్ల దూరం, కర్ణాటకలోకే వస్తుంది.)
ఈ మూడు క్షేత్రాలు, స్వామిని సర్ప రూపంలో చూస్తే ఆది, మధ్య, అంత్యములుగా చెప్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రాలు.

కుక్కేలో స్వామి మొదట ఒక పుట్టగా మాత్రమే వెలిశారు. దానినే ఆది సుబ్రహ్మణ్య అని పిలుస్తారు. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చాలా అద్భుతంగా చేస్తారు. ఈ సర్పదోష నివారణ పూజ చేయించిన వారికి, కాలసర్పదోషము, ఇతఃపూర్వం పాములను చంపిన దోషము, నవగ్రహ దోషాలు శమింపబడి, స్వామి వారి కారుణ్యంతో సంతానము లేనివారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ ఇచ్చే మూల ప్రసాదం (పుట్టమన్ను) చాలా చాలా శక్తివంతమైనది. ఇది నియమముతో నలభైరోజులు, రాత్రి పడుకునే ముందు, పాలతో మూలప్రసాదం తీసుకుంటే, ఎటువంటి దోషాలు లేకుండా, చక్కని చిన్ని సుబ్రహ్మణ్యుడో, చిన్ని కృష్ణుడో, బుజ్జి రుక్మిణి అమ్మో, సీతమ్మో సంతానంగా పుడతారు.
కుక్కేలో ఉన్న ప్రథాన ఆలయాలు –
౧. ఆది సుబ్రహ్మణ్య – ఇక్కడ పుట్ట రూపములో ఉంటారు.
౨. కుక్కేసుబ్రహ్మణ్య – ఇక్కడ గర్భగుడిలో వాసుకి, ఆపైనా ఆదిశేషుడూ, ఆపైన సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉంటారు. వాసుకిని రక్షించడం కోసం స్వామి ఇక్కడ వెలిశారు. వాసుకి, ఆదిశేష, సుబ్రహ్మణ్యులను కలిసి ఒకేసారి చూడడం పరమ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఆలయానికి పశ్చిమాన ఉన్న ద్వారం నుండి ప్రవేశిస్తాము. ఆపైన ప్రదక్షిణ చేస్తూ తూర్పుద్వారం గుండా గర్భాలయంలోకి ప్రవేశిస్తాము. అక్కడ స్వామి వారి ఎదురుగా ఉన్న ధ్వజస్థంభాన్ని గరుడ స్థంభం అని పిలుస్తారు. అది వెండితో చేయబడి ఉంటుంది. ఈ స్థంభం యొక్క విశిష్టత ఏమిటంటే, వాసుకి, ఆదిశేషుల నుంచి వచ్చే శ్వాస వలన, భక్తులను రక్షించడం కొరకు ఈ ఈ గరుడ స్థంభం. ఇదే ఆలయ ప్రాంగణములో ఉమామహేశ్వరులు (పరమశివుని వామాంకముపై కూర్చుని ఉన్న అమ్మవారు..), కుక్కేలింగము, కాలభైరవ స్వామి వారు, ప్రథాన గర్భాలయము ప్రక్కగా నరసింహస్వామి వారు కొలువై ఉంటారు. ఇదేక్షేత్రములో తూర్పుద్వారానికి పక్కగా, నాగప్రతిష్ట చేసే నాగేంద్ర స్వామి వారి సన్నిధి, దాని ప్రక్కనే శృంగేరీ పీఠం వారి అన్నదానం చేసే హాలు, ఇంకా ప్రదక్షిణదిశలో ముందుకి వెడితే, దక్షిణద్వారం దగ్గర కుక్కే సుబ్రహ్మణ్య గ్రామ దేవత “హోసలిగమ్మ” వారు కొలువై ఉంటారు.
కుక్కేశ్రీసుబ్రహ్మణ్య క్షేత్రములో ఉన్న మరొక ప్రథానమైనది, కుమారధార నది (తీర్థం). ఈ తీర్థం పరమపవిత్రమైనది. కుక్కేలోపలికి వెళ్ళేటప్పుడు మొదటగా ఈ కుమారధార దాటి వెడతాము. మేము కుక్కే చేరుకునే సరికి రాత్రి పది దాటిపోవడం వల్ల, ఆ మరుసటిరోజు ఉదయాన్నే మేము ఈ తీర్థ స్నానం చేశాము. చాలా ప్రశాంతముగా, స్వఛ్చముగా ఉంటుంది ఈ తీర్థం. లోతు అంతగా ఉండదు. ఇవి కాక, ఈ కుక్కేసుబ్రహ్మణ్యా గ్రామంలోకి వెళ్ళేటప్పుడు, కుమారధార దాటిన తర్వాత మొదట దర్శనమయ్యేది “అభయగణపతి స్వామి వారు”. ఈ గణపతి ఈ క్షేత్రపాలకుడు. స్వామి చాలా చాలా బృహత్ స్వరూపంలో ఉంటారు. అభయగణపతి ఆలయం ప్రక్కనే వనదుర్గా అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇంకాస్త ముడుకి వెడితే, బస్టాండుకి దగ్గరలో కాశికట్టె గణపతి స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ స్వామి చాలా చిన్నగా ముద్దుగా ఉంటారు. ఈ కాశికట్టె గణపతిని నారాద మహర్షి ప్రతిష్ఠించారు. ఇదే ఆలయంలో “ముఖ్యప్రాణ దేవారు” సన్నిధి కూడా ఉంటుంది. ముఖ్యప్రాణ దేవారు అంటే ఎవరో అనుకున్నారా… సాక్షాత్తు పవనసుతుడు మన స్వామి శ్రీరామదూత, హనుమయే. స్వామిని కర్ణాటక క్షేత్రాలన్నిటిలోనూ అలా ముఖ్యప్రాణదేవారు అని వ్యవహరిస్తారు.

ఇక భోజనం కొరకు, ఇక్కడ బ్రాహ్మణుల కోసం మధ్యాహ్నం పూట శృంగేరి వారి అన్నదాన సత్రం ఆలయం లోపలే ఉంది. ఇది గాక, అందరికీ ఆలయం ఎదురుగా మరొక అన్నదాన సత్రం ఉన్నది. ఇది దేవస్థానం వారిదే. కాకపోతే ఇక్కడ మధ్యాహ్నం, రాత్రి మాత్రమే ఉంటుంది. పొద్దున్న ఏ టిఫినో తినాలి అంటే, బయట దుకాణాలపై ఆధారపదవలసినదే.

ఈ క్షేత్రంలో సంతానం కోసం చేసే ప్రథానమైన సేవలు… సర్ప సంస్కార పూజ (అంటే సర్ప దోష నివారణ), నాగప్రతిష్ఠ, ఆశ్లేషబలి… పిల్లలు పుట్టాక అంగప్రదక్షిణ, తులాభారం.

బెంగళూరు నుండీ బయలుదేరి దర్శించ వలసిన క్షేత్రాలు వరుసగా….
౧. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య
౨. ఉడిపి శ్రీ కృష్ణ మఠం
౩. కొల్లూరు మూకాంబికా క్షేత్రం
౪. శృంగేరీ శారదా మఠం
౫. హోర్నాడు శ్రీ అన్నపూర్ణేశ్వరీ క్షేత్రం

About The Author