కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ -తండ్రికి తగ్గ తనయుడిగా కెటిఆర్…
కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్
-తండ్రికి తగ్గ తనయుడిగా కెటిఆర్
-రాజకీయ చతురత, వూహంతో కీలక బాధ్యతలు
అధికార టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యువకుడైన కెటిఆర్‌ను నియమించడం పట్ల పార్టీలో సర్వత్రా హర్షం వ్యక్తమైంది. ఉదయం నుంచీ కెటిఆర్‌కు శుభాకాంక్షలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి రాష్ట్ర ఏర్పాటులో భాగస్వాములైన కెటిఆర్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వంలోనూ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజలకు చేరువైన కెటిఆర్ ఇకపైన పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలక భూమికను పోషించనున్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అభంతరం తలెత్తిన అసంతృప్తులను బుజ్జగించి అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో కెటిఆర్ తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించినట్లు పార్టీ అధ్యక్షుడు కెసిఆర భావించారు.
రెండేళ్ళ క్రితం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 99 సీట్లను కైవశం చేసుకుని చరిత్ర సృష్టించడంలో కెటిఆర్‌ది కీలక పాత్ర. ఆ తర్వాత తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సైతం జిహెచ్ఎంసి పరిధిలో ఏకంగా 16 స్థానాలను కైవసం చేసుకోవడంలో మరోమారు సమర్ధతను నిరూపించుకున్నారు. గత ప్రభుత్వంలో ఐటి, పరిశ్రమలు, పురపాలక శాఖ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారు. కెటిఆర్ పనితీరు పట్ల ప్రధాని మోడి కూడా హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు సందర్భంగా, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ స్వయంగా కెటిఆర్‌ను పక్కకు పిలిపించుకున్నారు.
ఐటి ఇంజనీర్ నుంచి రాజకీయాల్లోకి…
కరీంనగర్, హైదరాబాద్‌లో ప్రాథమిక, హైస్కూలు విద్యాభ్యాసం చేసి కర్ణాటక మెడికల్ కాలేజీలో మెడిసిన్ సీటు వచ్చినా ఇష్టం లేకపోవడంతో నగరంలోని నిజాం కాలేజీలో బిఎస్సి (మైక్రో బయాలజీ) పూర్తి చేసి పూణె యూనివర్శిటీలోని ఎంఎస్సి బయో టెక్నాలజీ పూర్తి చేశారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో మేనేజ్మెంట్ అండ్ ఈ కామర్స్‌లో ఎంబిఏ పూర్తిచేసి అమెరికాలోని ‘ఇంట్రా’ సంస్థలో ఐదేళ్ళ పాటు ప్రాజెక్టు మేనేజర్‌గా పనిచేశారు. స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో తండ్రికి అండగా నిలవాలని భావించి 2006లో హైదరాబాద్‌కు వచ్చి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2009 ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి గెలుపొందిన కెటిఆర్ 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని బాసటగా నిలిచారు. తెలంగాణ కోసం ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కెకె మహేందర్ రెడ్డిపై 68,220 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరు రవీందర్ రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 89,009 ఓట్ల మెజార్టీతో గెలిచారు.
మంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి…
తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి తదితర పలు మంత్రిత్వశాఖలను నిర్వహించిన కెటిఆర్ అనేక వినూత్న నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.45 వేల కోట్లుగా ఉన్న సాఫ్ట్వేర్ ఎగుమతులను 2018 నాటికి రూ. 80 వేల కోట్ల స్థాయికి తీసుకెళ్ళారు. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్ కోతలతో ఇబ్బంది పడిన పరిశ్రమలను గాడిలో పెట్టడానికి, కొత్త పరిశ్రమల స్థాపనకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి వినూత్నమైన ‘టిఎస్ ఐ పాస్’ అనే పారిశ్రామిక పాలసీని తీసుకురావడంలో చొరవ తీసుకున్నారు.
సులభతర వాణిజ్య విభాగంలో దేశంలోనే తొలి స్థానంలో తెలంగాణను నిలబెట్టడంతో పాటు 2018 మార్చి నాటికి రాష్ట్రానికి సుమారు రూ. 1.23 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించగలిగారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రైవేటు రంగంలో సుమారు 5.27 లక్షల మందికి ఉపాధి కల్పన జరిగింది. ఐటి రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ‘టి హబ్’ను, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా ‘వి హబ్’లకు శ్రీకారం చుట్టారు. ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్పార్కు, టెక్స్టైల్ పార్కు.. ఇలా పారిశ్రామికంగా అనేక రకాలుగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు రావడానికి కృషి చేశారు.
అన్ని వర్గాల మద్ధతను చూరగొన్నారు
తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా మొత్తం బాధ్యతను కెటిఆర్ తీసుకున్నారు. వంద డివిజన్లలో కార్పొరేటర్లను గెలిపించుకోవాలని లక్షంగా పెట్టుకుని 99 చోట్ల గెలిపించుకోగలిగారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గ్రేటర్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను తీసుకున్నారు. ఏడు స్థానాలు ఎంఐఎంకు పోతే మిగిలిన 17 స్థానాల్లోనూ టిఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారన్న ధీమాతో వ్యూహాత్మకంగా వ్యవహరించి 16 స్థానాల్లో గెలిపించుకున్నారు.
రాష్ట్రమంతటా ‘ప్రజా ఆశీర్వాద సభ’ల్లో కెసిఆర్ సుడిగాలి పర్యటన చేస్తే హైదరాబాద్ నగరంలోని నియోజకవర్గాల్లో మాత్రం కెటిఆర్ రోడ్ షో లు నిర్వహిస్తూ వివిధ కుల సంఘాలు, వెల్ఫేర్ అసోసియేషన్స్ తదితర సంస్థలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి వారి మద్దతును చూరొగొన్నారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినవారి మనసుల్లో ఉన్న ‘సెటిలర్’ అనే భావనను తొలగించి ‘హైదరాబాదీలం’ అనే విశ్వాసాన్ని నింపి సంప్రదాయకంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే లక్షలాది మంది ఓటర్లను టిఆర్ఎస్వైపుకు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. రెండు సందర్భాల్లోనూ సమర్ధుడిగా కెసిఆర్ దృష్టిలో పడిన కెటిఆర్ ఇప్పుడు ఏకంగా పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఈ నెల 17న బాధ్యతలు చేపట్టబోతున్నారు.