కరోనా కట్టడికి చిట్కాలంటూ పిచ్చి పిచ్చి సలహాలు- నమ్మితే ప్రమాదమే..
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రకృతి వైద్య శాస్త్రవేత్తలమంటూ కొందరు కుహనా మేధావులు బయలుదేరారు.. కరోనా కట్టడికి చిట్కాలంటూ పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చిపారేస్తున్నారు.. అమాయక జనం వాటిని నిజమని నమ్మేస్తున్నారు. చెప్పేవాడికి వినే వాడు లోకువన్నట్టు ప్రతి వాడూ డాక్టర్ అవతారమెత్తుతున్నాడు.. కరోనా వెల్లుల్లి రసంతో నయమవుతుంది అని ఓ ప్రచారం బోగస్ అని తేల్చేశారు.
వెల్లుల్లి రసంతో ‘కరోనా’ నయం కాదని తేటతెల్లమైంది. అయితే వెల్లుల్లి మాత్రమే కాదు.. నువ్వుల నూనె, మౌత్ వాష్‌ల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ మేరకు ‘కరోనా చికిత్స’పై వస్తున్న పుకార్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) కొట్టిపారేసింది.
ఓ వైపు రోజురోజుకీ కరోనా తీవ్ర రూపం దాలుస్తుండగా.. మరోవైపు వదంతులు కూడా అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. వెల్లుల్లి రసం, నువ్వుల నూనె, మౌత్ వాష్‌ల వల్ల కరోనా తగ్గుతుందంటూ పుకార్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని డబ్ల్యూహెచ్ఓ తాజాగా స్పష్టం చేసింది. ‘వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదే.. మౌత్ వాష్‌ల వల్ల నోటికి తాజాదనం లభిస్తుంది. అంతేగానీ ఇవి కరోనా నుంచి రక్షించవు’ అని చెబుతూ వదంతులను కొట్టిపారేసింది. తప్పుడు సమాచారాలపై డబ్ల్యూహెచ్ఓ వెబ్సైట్లో స్పష్టతనిచ్చింది.
మౌత్‌వాష్‌లు కరోనా సోకకుండా కాపాడుతాయనడంలో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. నువ్వుల నూనెను శరీరమంతా రాసుకుంటే కరోనా వైరస్‌ను చంపేస్తుందని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. యాంటీబయోటిక్స్, హెర్బల్ టీ, సీ విటమిన్‌ను తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది. ‘ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి రక్షించే కచ్చితమైన మెడిసిన్ ఏదీ రాలేదు. అయితే కరోనా సోకిన రోగుల పట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ క్లినికల్ చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని చికిత్సలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ పరిశోధనలకు డబ్ల్యూహెచ్ఓ కూడా తమవంతు సహకారం అందిస్తోంది. కరోనా చికిత్సలపై వస్తున్న పుకార్లను నమ్మొద్దు’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ విషయాన్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఇండియా తన ట్విటర్ ఖాతాలో పేర్కొంది.