కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముగిసిన ఏపి ముఖ్యమంత్రి భేటి…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా ల మధ్య భేటీ అరగంటలో ముగిసింది…
ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలను అమిత్ షా దృష్టికి జగన్ తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అమిత్ షా తో భేటీ పూర్తి అవడానికి ముందే జగన్ సమర్పించిన వినతి పత్రంలోని అంశాలు మీడియాకు లీకైయ్యాయి.
పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ ద్వారా ఇప్పటివరకూ రూ.838 కోట్లను ఆదాచేశామని, ప్రభుత్వ తీసుకుంటున్న వివిధ చర్యలద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంతో సాగుతోందని తెలిపారు జగన్…
2021 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని, అయితే ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉన్న అంశాన్ని అమిత్ షా దృష్టికి జగన్ తీసుకెళ్ళారు.
ప్రాజెక్టు రివైజ్డ్ అంచనాలను రూ.55,549 కోట్లుగా కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక కమిటీ ఫిబ్రవరి 2019న ఆమోదించిందని, దీనికి సంబంధించిన పరిపాలనపరమైన అనుమతి ఇప్పించాలని షా ను కోరారు సీఎం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల రూపేణా, గ్రాంట్ల రూపేణా రాష్ట్రానికి కేవలం రూ.10, 610 కోట్లు మాత్రమే వచ్చిందని, గత ఏడాది విడుదల చేసిన రూ.22,000 కోట్లలో ఇది సగం మాత్రమేనని అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళారు జగన్.
ప్రత్యేక ఆర్థిక సహాయం పొందుతున్న కలహండి, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి సగటున రూ.4000 ఇస్తే, ఏపీలో వెనకబడ్డ 7 జిల్లాల్లో కేవలం రూ.400 మాత్రమే ఇస్తున్నారని, ఏపీలో వెనకబడ్డ జిల్లాలకు ఇస్తున్న ప్యాకేజీని కలహండి, బుందేల్ ఖండ్ తరహాలో ఉండేలా చూడాలని హోంమంత్రిని కోరారు ఏపి సీఎం.
2014–15 నాటికి రెవిన్యూ లోటును రూ. 22,949 గా కాగ్ నిర్ధారించిందని, రూ.18,969 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఆ మొత్తాన్ని విడుదల చేయించాల్సిందిగా హోంమంత్రిని కోరారు జగన్.
రాజధాని నిర్మాణంకోసం రూ.2,500 కోట్లు కేటాయిస్తే, ఇప్పటివరకూ రూ.1,000 కోట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలిన మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా సీఎం కోరారు.
#మూడురాజధానులు:
పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణల ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రికి వివరించారు జగన్.
అందులో భాగంగానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతిగా నిర్ణయించామని, ఈ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదం తెలిపాయని అమిత్ షాకు తెలిపారు.
హైకోర్టును కర్నూలుకు తరలించడానికి కేంద్ర న్యాయశాఖకు తగిన సూచనలు చేయాలని కోరిన జగన్… రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని షా దృష్టికి తీసుకు వచ్చారు.
ప్రజల అభివృద్ధి, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సిన శాసన మండలి… ప్రతీ అంశంలో అడ్డుపడే ధోరణితో, పక్షపాతంతో వ్యవహరిస్తోందని తెలిపారు. మండలి రద్దు, తదనంతరం తీసుకోవాల్సిన చర్యలకోసం అమిత్‌షాకు వినతి పత్రం అందచేసారు జగన్..