భర్త తాళం వేసి వెళ్ళిపోయాడు.. 8 నెలలుగా ఆ తల్లి ఇంట్లోనే బందీ…


వీధి మొహం చూడకుండా నాలుగు గోడల మధ్య… ఎవరైనా ఎన్ని రోజులు ఉండగలరు? చాలా కష్టం కదూ. అలాంటిది 72 ఏళ్ల వయసులో.. తాళం వేసిన ఇంటిలో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ గడుపుతోందామె. లోపల ఆహారం లేదు. కరెంటు లేదు. ఉన్న దుస్తుల్నే ఓపిక చేసుకుని ఉతుక్కోవాలి. ఎనిమిది నెలల కిందట ఇల్లు తాళమేసి వెళ్లిపోయిన భర్త ఎప్పుడొస్తాడో తెలియదు. ముషీరాబాద్‌ నియోజకవర్గం అడిక్‌మెట్‌ డివిజన్‌ గణేశ్‌నగర్‌ ఇంటి నంబర్‌ 1-9-129/23/సీ/83 మొదటి అంతస్తులో ఏడాదిన్నర క్రితం గంగాధర్‌, ఆయన భార్య బేబి(72)తో కలిసి అద్దెకు దిగారు. కృష్ణా జిల్లా నాగాయలంక వీఆర్వోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందానని, తమకు పిల్లలు లేరని ఇంటి యజమానురాలు శారదకు చెప్పారు. అప్పటి నుంచీ ఆయన బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి బయట తాళం వేసి వెళ్లేవాడు. ఒకోసారి రెండుమూడు రోజులు వచ్చేవాడు కాదు. తరచూ యజమానురాలే వృద్ధురాలిని బయటి నుంచి పలకరించేవారు. అవసరమైతే అన్నం పెట్టేవారు. ఆంధ్రాలో తన వ్యవసాయ భూమి విక్రయించి వస్తానని చెప్పి గత జులై మొదటి వారంలో వెళ్లిన గంగాధర్‌ నేటికీ తిరిగి రాలేదు. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా స్పందన లేదని, మూడు నెలల కిందట ఒకసారి ఫోన్‌ చేసి, త్వరలో వస్తానని చెప్పినట్లు యజమానురాలు తెలిపారు. అద్దె కట్టడం రెండు రోజులు ఆలస్యమైతేనే ఒప్పుకోని నేటి పరిస్థితుల్లో ఎనిమిది నెలలుగా అద్దె లేకున్నా, ఆ వృద్ధురాలికి అన్నం పెట్టి ఆదుకుంటున్నారు శారద. తమకూ కష్టాలున్నా శారద ‘మాకు ఏ జన్మలో రుణమో’ అంటూ మానవత్వంతో వ్యవహరిస్తున్నారు. తన భర్త ఎప్పుడొస్తారా అని వృద్ధురాలు బేబి ఎదురు చూస్తున్నారు.

About The Author