అమ్మ దగ్గరున్నా.. అమెరికాలో ఉన్నా.. తెలంగాణ తపనే…

అమ్మ దగ్గరున్నా.. అమెరికాలో ఉన్నా.. తెలంగాణ తపనే

దేశంలోని సమకాలిక రాజకీయనాయకుల్లో కేటీఆర్ వంటివారు లేరు. విషయపరిజ్ఞానమైనా.. వాక్పటిమలోనైనా, భావాన్ని వ్యక్తీకరించడంలోనైనా, పాలనపై అవగాహనలోనైనా ఆయనకు ఆయనే సాటి. పల్లెలో పేద రైతుతోనైనా, హైదరాబాద్‌లోని మధ్యతరగతి మహిళతోనైనా, సామాజిక మాధ్యమాల్లో యువతతోనైనా.. ప్రపంచవేదికలపైనైనా ఎంతో వినయంగా, వారి మనసుకు దగ్గరగా మాట్లాడటం కేటీఆర్‌కే చెల్లింది. దేశ నాయకత్వం కోసం తెలంగాణ అందిస్తున్న భవిష్యత్ రాజకీయ దృవతార కల్వకుంట్ల తారకరామారావు. రాజకీయాలను ఈసడించుకుంటున్న యువతకు ఆయన ఒక ఆకర్షణ. పేద, మధ్యతరగతి వారికి ఆయనో భరోసా. టీఆర్‌ఎస్‌కు ఆయన ఇప్పుడు కార్యనిర్వహక అధ్యక్షుడు..

పదోతరగతిలోపు ఏడు స్కూళ్లలో చదువు
కేటీఆర్ పదో తరగతి వరకు ఏడు స్కూళ్లలో చదివారు. కరీంనగర్ ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూలు, హైదరాబాద్ అబిడ్స్‌లోని గ్రామర్ స్కూల్.. ఇలా ఆయన విద్యాభ్యాసం సాగింది. ఇంటర్ గుంటూరులో చదివారు. హైదరబాద్‌లోని నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో డిగ్రీ చేశారు. పుణె యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చేసిన తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో మేనేజ్‌మెంట్ అండ్ ఈ-కాంలో ఎంబీఏ పూర్తిచేశారు. కేసీఆర్‌కు తన కొడుకు ఐఏఎస్ అధికారి కావాలని ప్రజలకు సేవలందించాలని ఉండేది. కానీ కేటీఆర్‌కు ఇది నచ్చలేదు. అయినా తండ్రిమాట కాదనలేక కొంతకాలం ఢిల్లీకి వెళ్లివచ్చారు. అక్కడి పరిస్థితులను, ఐటీ సహా ప్రపంచమార్కెట్లలో ఉన్న పరిస్థితులను గమనించి ప్రైవేటురంగంలో ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. తండ్రిని ఒప్పించి అమెరికా వెళ్లారు.

ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమంలోకి..
అమ్మ దగ్గరున్నా.. అమెరికాలో ఉన్నా కేటీఆర్ ప్రతిరోజూ తెలంగాణలో ఏం జరుగుతుందో తెలుసుకునేవారు. ఇంటర్నెట్‌లో రోజూ పత్రికలు చదువడం, ఇక్కడ ఉన్నవారితో మాట్లాడేవారు.
ఆయన అమెరికాలోని ఇంట్రా అనే సంస్థలో పనిచేసేవారు. ఆ సంస్థ దక్షిణాసియా వ్యవహారాలను కేటీఆర్‌కు అప్పగించడం తో 2004లో భారత్ కేంద్రంగా పనిచేసేవారు. 2006 ఉప ఎన్నికల వరకు అందులోనే కొనసాగారు. 2006 కరీంనగర్ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లేముందు ఉద్యోగానికి రాజీనామా చేశారు. రూ.6 లక్షల జీతం వదులుకొని ఉద్యమ రణక్షేత్రంలోకి దిగారు. ఈ విషయం తండ్రి కేసీఆర్‌కు తెలియదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక కేటీఆర్ విషయాన్ని తండ్రికి చెప్పారు. అప్పుడాయన అన్నీ ఆలోచించుకున్నావా?పార్టీలో, ఉద్యమంలో నీకంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అందరు ఉద్యమకారుల్లాగే నీవు పనిచేసి నిన్ను నీవు నిరూపించుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు. అన్నింటికీ సిద్ధపడే వచ్చానని చెప్పి అప్పటి నుంచి పూర్తిస్థాయిలో ఉద్యమంలో మమేకమయ్యారు కేటీఆర్.

పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తొలి పదవి
కేటీఆర్ 2006లోనే ఉద్యమంలోకి, పార్టీలోకి వచ్చినా పార్టీ పదవి మాత్రం 2008 నవంబర్ 17న వరించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. అప్పుడున్న 39 మంది పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒక్కడిగా పనిచేశారు.

సున్నిత మనస్కుడు..
కేసీఆర్ లాగే కేటీఆర్ కూడా సున్నిత మనస్కుడు. ఎంతగా అంటే.. ఆయన ముద్దుగా పెంచుకున్న లైలా అనే కుక్క పిల్ల చనిపోతే తిండిమానేశారు. కేసీఆర్ తెలంగాణ కోసం అమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా అంతే. నిమ్స్‌లో ఉన్న తండ్రిని చూసి కేటీఆర్ ఎంతో బాధను దిగమింగుకున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నామని సమాచారం ఇస్తే చాలు.. తన వద్ద ఉన్నది ఇవ్వడం ఆయన నైజం. సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినా.. తక్షణం తన వాళ్లను అక్కడికి పంపి ఆదుకుంటారు. ఇది ఆయనలోని మానవీయ కోణం. ఆయన ట్విట్టర్, వాట్సప్ ఖాతాలకు వచ్చే పోస్టులపై స్పందించి సాయం చేసేందుకు ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. రోజువారీగా వీటిపై సమీక్ష కూడా నిర్వహిస్తుంటారు.

అమ్మకూచీనే.. తండ్రి మాటే శిరోధార్యం
కేటీఆర్ అచ్చంగా అమ్మకూచీనే. నాన్న ఎప్పుడూ బిజీగా ఉండటంతో అమ్మతోనే చనువు పెరిగింది. చిన్నప్పుడే కాదు.. ఇప్పటికీ కేటీఆర్‌కు తండ్రి అంటే భయంతో కూడిన భక్తి, అభిమానం ఉంటాయి. తండ్రి మాటే శిరోధార్యం. రాజకీయ నిర్ణయాలైనా, వ్యక్తిగత నిర్ణయాలైనా అంతే.

కేటీఆర్‌ను కదిలించిన నినాదం
వెన్ పాలిటిక్స్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్.. యూ డిసైడ్ వాట్ యువర్ ఫ్యూచర్ అన్న నినాదం కేటీఆర్‌ను బాగా కదిలించింది. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలని, ప్రతి ఒక్కరికీ రాజకీయాలపై అవగాహన ఉండాలని చెప్తుంటారు. ప్రతీదీ రాజకీయంతోనే ముడిపడి ఉన్నదని, మరి మనం రాజకీయంతో ఎందుకు దూరంగా ఉండాలని ప్రశ్నిస్తుంటారు. యువత తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రాధా న్యం ఇస్తుంటారు. సామాజిక మాధ్యమాలను విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ఆయన ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య 14.90 లక్షలకుపైనే, ఫేస్‌బుక్‌లో ఫాలో అవుతున్నవారి సంఖ్య 9,51,500 మంది. తెలుగు రాష్ర్టాల రాజకీయ నేతల్లో ఆయనే టాప్.

ఫ్యామిలీమెన్..
కేటీఆర్‌కు ఏమాత్రం సమయం దొరికినా తన కుటుంబంతో గడపడం ఇష్టం. శని, ఆదివారాల్లో పూర్తిస్థాయిలో పిల్లలతో గడిపేందుకు ప్రయత్నిస్తారు. అయితే చాలా సందర్భాల్లో కుదరదు. కానీ ఎంతో కొంత సమయం చూసుకొని పిల్లలతో మాట్లాడుతారు. కొడుకు హిమాన్షు, కూతురు అలేఖ్య చదువు గురించి ఆరా తీస్తారు. వాళ్ల స్కూళ్లలో టీచర్లతో మాట్లాడుతారు. కేటీఆర్ భార్య శైలిమ గృహిణి. ఆమెకు ఓపిక ఎక్కువ అని కేటీఆర్ చెప్తుంటారు. తన సహకారం ఉండటంతోనే తాను ఏ పనిచేస్తున్నా ప్రశాంతంగా ఉండగలుగుతున్నానని, తన బిజీ జీవితం గురించి పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తుంటారని చెప్తుంటారు. సోదరి, ఎంపీ కవిత అంటే కేటీఆర్‌కు వల్లమాలిన అభిమానం.

ముక్కుసూటితనం.. నిజాయితీ
కేటీఆర్ ముక్కుసూటి మనిషి. ఎవరితోనైనా నిర్మొహమాటంగానే ఉంటారు. ఆయన నిజాయితీకి విలువ ఇస్తారు. ఆయన పాటించడమే కాదు.. ఇతరులూ పాటించాలని కోరుతుంటారు. అందుకే తనకు రాజకీయాలు సరిపోవేమోనని అంటుంటారు.

ఐకాన్ ఆఫ్ ద ఇయర్
కేటీఆర్‌ను అనేక అవార్డులు వరించాయి. ప్రఖ్యాత సీఎన్‌ఎన్-రిట్జ్ సంస్థలు ఆయనను ఐకాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో సత్కరించాయి. చదువుకొనే సమయంలో మిస్టర్ పుణె యూనివర్సిటీగా కూడా ఎంపికయ్యారు. గోవా ఐటీశాఖ మంత్రి రోహన్ కౌంటే అయితే మీరు యువతకు స్ఫూర్తిదాయకులు అంటూ హైదరాబాద్‌కు వచ్చి పొగిడారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్ సహా అనేక మంది కేటీఆర్ పనితీరుకు మంత్రముగ్దులయ్యారు.

క్రికెట్ అంటే ఇష్టం..
కేటీఆర్ పత్రికలను క్షుణ్ణంగా చదువుతారు. పుస్తకాలంటే మక్కు వ. టైం దొరికితే క్రికెట్ ఆడుతుంటారు. క్రికెట్ మ్యాచ్‌లను చూస్తుంటారు. సచిన్, ధోనీ అంటే ఇష్టం.

సిరిసిల్ల నుంచి అసెంబ్లీకి..
కేటీఆర్ 2009లో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఇప్పటివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పాలేరు ఉప ఎన్నికైనా, జీహెచ్‌ఎంసీ, ఇటీవలి ఎన్నికల్లో తన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు.

తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడు
టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి కార్యనిర్వహక అధ్యక్ష పదవి లేదు. తొలిసారి కేటీఆర్‌కు కార్యనిర్వహక అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇదో రికార్డు.

పేరు: కల్వకుంట్ల తారకరామారావు
పుట్టింది: 1976 జూలై 24
కుటుంబం:
తండ్రి: కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.
తల్లి: శోభ. సోదరి: కవిత.
భార్య: శైలిమ
పిల్లలు: హిమాన్షు, అలేఖ్య
తొలిపదవి: 2008 నవంబర్ 17న టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా, 2009 సాధారణ ఎన్నికల్లో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక. 2010 ఉప ఎన్నిక, 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వరుసగా గెలుపొందారు.

సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం. సీఎం కేసీఆర్ కొడుకుగా కాకుండా క్రమశిక్షణగల కార్యకర్తగా, పరిణతిగల నాయకుడిగా కేటీఆర్ వ్యవహరించారు. అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటిచేత్తో టీఆర్‌ఎస్‌కు విజయం కట్టబెట్టారు.
– కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం

సీఎం కేసీఆర్ అప్పగించిన అన్ని బాధ్యతలను కేటీఆర్ సమర్థంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా అందరినీ మెప్పించగల సమర్థుడు కేటీఆర్.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ మంత్రి

కేటీఆర్ నియామకంతో పార్టీ సంస్థాగతంగా మరింత బలపడుతుంది. రాష్ర్టానికి పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా కేటీఆర్ ఎంతో కృషిచేశారు. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు.
– జోగు రామన్న, మాజీ మంత్రి

కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపిక చేయడంతో పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొన్నది. ఆయనకు నూతన బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయం.
– సీ లకా్ష్మరెడ్డి, మాజీ మంత్రి

కేటీఆర్‌కు అభినందనలు. అన్నా.. ఇది పదవి కాదు బాధ్యత. పార్టీని బలోపేతం చేయడానికి, కార్యకర్తలకు, నాయకులకు సేవ చేయడానికి మంచి అవకాశం. సమర్థుడైన యువ నాయకుడు కేటీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుంది.
– జోగినిపల్లి సంతోష్ కుమార్, రాజ్యసభ సభ్యుడు

పార్టీని పటిష్ఠం చేయడంలో, యువ నాయకత్వాన్ని పెంపొందించడంలో కేటీఆర్ విజయం సాధించాలి. సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రశంసనీయం.
– పద్మారావు, మాజీ మంత్రి

కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై అన్ని పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదం చేస్తుంది.
– సీతారాంనాయక్, ఎంపీ

యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం సంతోషకరమైన వార్త. సీఎం కేసీఆర్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు.
– బొంతు రామ్మోహన్, జీహెచ్‌ఎంసీ మేయర్

About The Author