ఏడాది పాటు స్మార్ట్‌ ఫోన్‌ వాడకపోతే 72 లక్షలు.. ఇదోరకం కోకకోలా పబ్లిసిటీ స్టంట్ …

ఏడాది పాటు స్మార్ట్‌ ఫోన్‌ వాడకపోతే 72 లక్షలు..
ఇదోరకం కోకకోలా పబ్లిసిటీ స్టంట్ ..


ఏడాది పాటు స్మార్ట్‌ ఫోన్‌ వాడకుండా ఉండగలుగుతారా? అయితే ఈ అవకాశం మీకోసమే. కోకకోలా సంస్థకు చెందిన విటమిన్‌ వాటర్ అనే కంపెనీ ‘నో ఫోన్‌ ఫర్‌ ఎ ఇయర్‌’ పేరిట ఓ వినూత్నమైన బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఏడాది పాటు స్మార్ట్‌ ఫోన్‌ వాడకుండా ఉంటే రూ.72 లక్షలు చెల్లిస్తుందట. ఈ విషయాన్ని విటమిన్‌ వాటర్‌ కంపెనీ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. అయితే కంపెనీకి తెలీకుండా గుట్టుగా ఫోన్‌ వాడేసి ఆ తర్వాత అసలు నేను ఫోనే వాడలేదు అని చెబితే మాత్రం కుదరదు.
ఎందుకంటే.. ఈ పోటీలో పాల్గొనే వారికి సరిగ్గా ఏడాది త్వారత కంపెనీ లై డిటెక్టర్‌ టెస్ట్‌ నిర్వహిస్తుంది. దీన్ని బట్టి సదరు మనిషి నిబంధనలు సరిగ్గా అనుసరించాడా? లేదా? అనేది తెలిసిపోతుంది. అంతేకాదు పోటీదారులకు కంపెనీ 1996 కాలం నాటి సెల్యులార్‌ టెలిఫోన్‌ను ఇస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌కి బదులు ఏడాది పాటు ఇదే టెలిఫోన్‌ను వాడాల్సి ఉంటుంది. దీనికి అయ్యే డబ్బు కూడా కంపెనీనే చెల్లిస్తుంది. ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు విటమిన్‌ వాటర్‌కు చెందిన ట్విటర్‌, లేదా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా జనవరి 8, 2019 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవారు స్మార్ట్‌ఫోన్‌ లేకుండా సమయాన్ని ఎలా గడపగలరు? అన్న విషయాన్ని సదరు పోటీదారుడు కంపెనీకి తెలియజేయాలి. వారికి పోటీదారుడు ఇచ్చే సమాధానం నచ్చితే కాంట్రాక్ట్‌ పత్రాలపై సంతకం చేయించుకుంటారు. ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ వాడుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే ఏడాది పాటు ఫోన్‌ వాడకుండా ఉండలేనివారికీ కంపెనీ ఓ అవకాశం కల్పించింది. ఆరు నెలల పాటు ఫోన్‌ వాడకపోయినా రూ.7లక్షలను అకౌంట్‌లో జమచేస్తుంది.

About The Author