రెండవ పాశురంలో ఆ వ్రతము పాటించవలసిన విధానాలు…
రెండవ పాశురంలో ఆ వ్రతము పాటించవలసిన విధానాలు చెప్తున్నది తల్లి.
దీనియొక్క భావమేమిటంటే ఆ వ్రతంలో మేము ఈ నియమాలు పాటిస్తున్నాం. సాటి గోపికలకు, సాటి సాధకులకు తల్లి చెప్తున్నది.
వైయెత్తు వాళ్ వీర్గాళ్ – ఈ సంబోధనలో గొప్పతనం ఏమిటంటే ఈ లోకంలోకెల్లా గొప్ప ఆనందాన్ని అనుభవించే వారు అని. ఈ సంబోధన అంత విశేషం. గోపికలు ఎటువంటి వారంటే ఈ లోకంలో ఎవరూ పొందని ఆనందం వాళ్ళు పొందుతున్నారుట. ఏమిటా ఆనందం? అంటే కృష్ణుడి కోసం వ్రతం చేయడమే ఆ ఆనందం. కృష్ణుడే తమ జీవిత లక్ష్యమని ఎంచుకోవడమే ఆనందం. వాళ్ళదీ ధన్య జీవనం, సార్థక జీవనం.
నాముం నం పావైక్కు శెయ్యుం కిరిశైగళ్ కేళీరో – కేళీరో అంటే వినండి. ఈ వ్రతంలో మనం చేస్తున్నది
పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి – పాలకడలి నుంచి ఉద్భవించినటువంటి వాడు పాలకడలిలో ఆ తరంగాలయొక్క కదలికలలో ఊగులాడేటటువంటి ఆ నారాయణుని గురించి చక్కగా కీర్తన చేద్దాం. ఇది కీర్తన ప్రధానం. అందుకే ఆ సంకీర్తన చేసేటప్పుడు భౌతిక నియమాలు ఏమిటంటే \
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం – నేతిని మనం స్వీకరించరాదు. పాలను స్వీకరించరాదు.
నాట్కాలే నీరాడి – అంటే ఏమీ స్వీకరించకుండా సుప్రభాత వేళలోనే/ప్రభాత వేళలోనే/బ్రాహ్మీ ముహూర్తం లోనే; నీరాడి – స్నానం చేసి
మైయిట్టెళుదోం – అంటే కంటికి కాటుక కూడా పెట్టుకోకుండా
మలరిట్టు నాం ముడియోమ్ – తలకి పువ్వులు ముడుచుకోకుండా
శెయ్యాదన శెయ్యోం – అంటే చేయకూడనివి చేయకుండా; పెద్దలు ఏవైతే చేయలేదో అవి మనం చేయకూడదు. నిషేధములు/చేయరాని పనులు చేయకుండా ఉండాలి. నియమబద్ధంగా ఉండాలి.
తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్ ఐయముం పిచ్చైయుం – కూడని మాటలు ఆడకుండా ప్రవర్తిస్తూ, ఒకరి గురించి ఒకరికి చెడుగా చెప్పకుండా ప్రవర్తిస్తూ దానము చేస్తూ, భిక్ష చేస్తూ పవిత్రమైన జీవనాన్ని గడపాలి. ఇటువంటి నియమాలతో ఈ దివ్య వ్రతాన్ని చేద్దాం అని తల్లి చెప్తున్నది రెండవ పాశురములో.