వడ్డికాశుల వాడ, వేంకటారమణా… Song
పాట: వడ్డికాశుల వాడ, వేంకటారమణా!
రాగం: శ్యామ రాగం.
పల్లవి.
వడ్డికాశుల వాడ, వేంకటారమణా!
అడుగడుగు దండాలు యివే మావి గొనుమా! ॥వడ్డి॥
అనుపల్లవి.
శ్రీపాద దాసులకు శరణిచ్చు దైవమా!
ఆపద మ్రొక్కులివి అమర నుత గొనుమా! ॥వడ్డి॥
అండజ వాహన, బ్రహ్మాండ నాయక,
కొండల రాయుడా! కీర్తనలు గొనుమా!
అండ దండగ నుండి అన్నింట మము బ్రోచు,
బండన భీముడా! మండనలు గొనుమా! ॥వడ్డి॥
పన్నగ శయనా! పద్మనాభ హరి, ఆ
పన్న మందార అర్చనలు గొనుమా!
అన్నమయ్యా నుత, అలమేలు వల్లభా!
కన్నయ్య, గోపాల! కీర్తనలు గొనుమా! ॥వడ్డి॥
వేద సన్నుత హరి వేంకటాద్రి వాస,
మాధవ నా నుతి మన్నించి గొనుమా!
శ్రీధర, శ్రీపతి, శ్రీ శ్రీనివాస,
నాద ప్రియ నా కీర్తి నిత్యము గొనుమా! ॥వడ్డి॥
తిరు వేంకటా రమణా! తత్వ స్వరూప,
హరి! నాదు ప్రార్ధనలు ఆదరణ గొనుమా!
శ్రీరమణ, శ్రీహరి, శ్రీవేంకటేశ,
నిరతము నా పూజ నిండుగా గొనుమా! ॥వడ్డి॥
సంగీతం, గానం: శ్రీమతి విజయలక్ష్మి గారు,
గీత రచన: రమాకాంతరావు చాకలకొండ, (ఏర్పేడు వ్యాసాశ్రమము వారిచ్చిన బిరుదు: అభినవ గేయసుధాకర)
తేది: సోమవారం, 17 డిసెంబర్ 2018