హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను మాకివ్వరా..! భారత్‌ను కోరిన ట్రంప్‌…


కరోనా వైరస్‌ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుల్ని తమకు అందించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఆ దేశంలో వైరస్‌ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌ అభ్యర్థనకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘నేను ఈరోజు ఉదయం ప్రధాని మోదీతో మాట్లాడాను. వారు భారీ స్థాయిలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తయారు చేస్తున్నారు. అమెరికా కోరిన మేరకు ఔషధాల్ని అందించాలని కోరాం. భారత్‌ దీన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది’’ అని శనివారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్‌ అన్నారు. మార్చి 25న భారత ప్రభుత్వం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతుల్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, మానవతా దృక్పథంతో ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపునిచ్చింది. కరోనా వైరస్‌ ముప్పుతో తలెత్తిన పరిస్థితుల గురించి మోదీ, ట్రంప్‌ శనివారం ఫోన్‌లో చర్చించిన విషయం తెలిసిందే. కొవిడ్‌-19తో పోరాడేందుకు భారత్‌, అమెరికా భాగస్వామ్య బలాన్ని పూర్తిస్థాయిలో వినియోగిస్తామని ఈ సందర్భంగా ఇరువురు అంగీకరించారు. అమెరికాలో ఇప్పటి వరకు 3,11,357 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 8,438 మంది మృత్యువాతపడ్డారు. రోజురోజుకీ పరిస్థితులు క్షీణిస్తుండడంతో కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ లేదా నయం చేసే మందులపై అమెరికా దృష్టి సారించింది. కొవిడ్‌-19 చికిత్సలో మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధం మెరుగైన ఫలితాలనిస్తోందని ట్రంప్‌ సహా ఇతర వైద్యారోగ్య సంస్థలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆ మందు కోసం ట్రంప్‌ భారత్‌ను ఆశ్రయించారు.

About The Author