అఖిలప్రియకు వైసీపీ ఎమ్మెల్యే సంచలన సవాల్.
కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరగడంపై రాజకీయ వివాదం రేగుతోంది. పట్టణంలో కేసులు పెరుగుతూ పోతుంటే ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్థానిక వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తాము తప్పు చేసి ఉంటే కర్నూలు రాజు గారి సెంటర్‌లో ఉరితీయండి అని సవాల్ విసిరారు. హఫీజ్ ఖాన్ ఏమన్నారు.. ‘నా వల్ల, కర్నూలు ఎంపీ వల్ల కరోనా వ్యాపించిందని భూమా అఖిలప్రియ ఆరోపించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అది నిరూపించాలి. నాపై విచారణ వేస్తారా వేయండి. అధికారులపై వేస్తారా? వేయండి. ఒకవేళ మేం తప్పు చేసి ఉంటే.. మా కర్నూలులో రాజుగారి సెంటర్ అని ఉంది. అక్కడ మమ్మల్ని ఉరితీయండి.’ అని హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. అందరికన్నా ముందు తానే మసీదులు బంద్ చేయించానని చెప్పారు. తబ్లిగీ జమాత్ నుంచి వచ్చినవారి ఇంటింటికీ వెళ్లి.. 24 గంటల్లో వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించామన్నారు. అఖిలప్రియ ఆరోపణలు కర్నూలు జిల్లాలో వైరస్ నియంత్రణకు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ లేదా ఎంపీ ఏం చేస్తున్నారో ఎవరికీ ఏమీ అర్థం కావట్లేదన్నారు. కరోనా కేసులు పెరగడానికి కారణం ఆయనేనని అందరికీ తెలుసన్నారు. పైగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై ఎంక్వైరీ చేయాలని హఫీజ్ ఖాన్ మాట్లాడుతున్నారని చెప్పారు. ఎంక్వైరీ చేయాల్సింది ఎమ్మెల్యేపై కామెంట్స్ చేసేవాళ్లపై కాదని.. ఆయన పైనే ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. కేసులు పెరగడానికి కారణమైనవాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి జగన్ లైట్ తీసుకున్నారని ఆరోపణలు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిల్లీగా తీసుకున్నారని… పారాసిటమాల్‌తో పోతుందని ప్రచారం చేశారని విమర్శించారు. దీంతో అధికారులు,ప్రజలు కరోనాను లైట్ తీసుకున్నారని చెప్పారు. ఎప్పుడైతే ఎన్నికల కమిషనర్ కరోనా వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేశారో.. కనీసం అప్పుడైనా జగన్ అన్ని శాఖల అధికారులతో సమావేశమై కరోనా గురించి చర్చిస్తే బాగుండేదన్నారు. కానీ జగన్ మాత్రం ఎన్నికల మీద పెట్టిన దృష్టి ప్రజల ప్రాణాలపై పెట్టలేదని విమర్శించారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. వైసీపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,నాయకులు ఎన్నికల పబ్లిసిటీలో మునిగిపోయారని.. వారివల్లే చాలామందికి కరోనా సోకిందని ఆరోపించారు. అధికారులకు కూడా వీళ్ల చుట్టూ తిరగడమే సరిపోయిందన్నారు. ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది కాబట్టే.. కరోనా కేసులను దాచిపెట్టారని ఆరోపించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేపై ఆరోపణలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారని.. ఎమ్మెల్యే తీరును చూసి దేశమంతా నవ్వుకుందని అన్నారు. ఆయన నిర్వాకం వల్లే 8 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా వచ్చిందన్నారు. ఓవైపు ప్రజల ప్రాణాల కోసం వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది కష్టపడుతుంటే.. ప్రభుత్వం మాత్రం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని.. జీవోల మీద జీవోలు ఇవ్వడమే తప్ప వారిని ఆదుకున్నది లేదని ఆరోపించారు.