పది నిమిషాల్లో ఆ రైలు టికెట్లన్నీ ఫినిష్…
న్యూదిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ముఖ్యమైన నగరాలకు ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వేశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 15రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్లను సోమవారం సాయంత్రం 4గంటలకు ప్రారంభిస్తామని చెప్పింది. అయితే, డేటా అప్‌లోడింగ్ ప్రక్రియలో భాగంగా ఆలస్యం కావడంతో ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. సాయంత్రం 6గంటలకు మళ్లీ అందుబాటులోకి తెస్తామని చెప్పింది.
కాగా, సాయంత్రం 6గంటలకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ కాగానే న్యూదిల్లీ-హౌడా రైలులోని ఏసీ-1, ఏసీ-3 బోగీల్లోని టికెట్లన్నీ కేవలం పది నిమిషాల్లో అమ్ముడుపోయాయి. మంగళవారం సాయంత్రం 5.05గంటలకు ఈ రైలు బయలుదేరనుంది. ఈ రైలే కాదు, భువనేశ్వర్-న్యూదిల్లీ స్పెషల్ ట్రైన్ సహా ఇతర పలు రైళ్లలో టికెట్లు అన్నీ 6.30 గంటలకు అమ్ముడుపోయాయి.
అంతకుముందు రైల్వేశాఖ ట్వీట్ చేస్తూ ‘ప్రత్యేక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నాం. త్వరలోనే టికెట్లు అందుబాటులోకి వస్తాయి. దయ చేసి వేచి ఉండండి. మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది.